జీడికి రూ.16 వేలు మద్దతుధర కల్పించాలి

Mar 27,2024 21:13

ప్రజాశక్తి-కురుపాం :  జీడిపిక్కలకు క్వింటాకు రూ.16 వేలు మద్దతు ధర కల్పించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం మండలంలో ఉరిడి, ఉదయపురం, మొండెంఖల్‌, గుజ్జువాయి తిత్తిరి, పెద్దగొత్తిలి, మరిపల్లి పంచాయతీల్లోని గిరిజన గ్రామాలను ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు బిడ్డక తిమోతి, బిడ్డిక అనిల్‌ కుమార్‌తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఈశ్వరరావు మాట్లాడుతూ రెండేళ్లుగా జీడికి గిట్టుబాటు లేక, పంట దిగుబడి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న గిరిజనులు.. దళారుల బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. తిత్లీ తుపాను వల్ల నేటి వరకు సరిగా పంట లేక బతుకుతెరువు కోసం ఏజెన్సీ ప్రాంతంలో వలసలు పోతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆరిక సంతోష్‌, బి.రాధమ్మ, ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️