జూనియర్‌ డాక్టర్ల ధర్నా

Dec 27,2023 21:42

ప్రజాశక్తి-విజయనగరంకోట :   ప్రభుత్వం ఏడు నెలలుగా బకాయి ఉన్న స్టయిఫండ్‌ను చెల్లించాలని కోరుతూ జూనియర్‌ వైద్యులు సర్వజన హాస్పిటల్‌ ఎదుట బుధవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము మెడికల్‌ కళాశాలలో చేరినప్పుడు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో చేరితే స్టయిఫండ్‌ ఇస్తామని చెప్పారని, ఏడు నెలలు గడుస్తున్నా ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. 7 నెలలకు గాను ఒక్కొక్క డాక్టర్‌ కు రూ.1,57,500 రావాల్సి ఉందన్నారు. ఇంతింత డబ్బులు పెట్టుకొని ఉద్యోగాలు చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉందన్నారు. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లైన భోగాపురం, సారిక తదితర చోట్ల తమకు డ్యూటీలు వేస్తున్నారని, అక్కడ ఎటువంటి భోజన సౌకర్యం గాని, విశ్రాంతి సౌకర్యాలు గాని ఏర్పాటు చేయలేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో 150 మంది జూనియర్‌ డాక్టర్లు పాల్గొన్నారు. జూడోల విజయనగరం అధ్యక్షులు డాక్టర్‌ భార్గవ్‌ రెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ శరత్‌, డాక్టర్‌ దివ్య, కీర్తన రెడ్డి, డాక్టర్లు పాల్గొన్నారు. టిడిపి నాయకుల మద్దతుజూనియర్‌ డాక్టర్ల ధర్నాకు టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పి.అతిథి గజపతి, జిల్లా ఫ్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, నగర అధ్యక్షుల ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్‌, మండల అధ్యక్షులు బొద్దల నర్సింగరావు తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అతిథి గజపతి మాట్లాడుతూ ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ప్రకారం నెలకు 25, 750 ఇవ్వవలసి ఉందన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలేవీ అమలు చేయరని మండిపడ్డారు. రాష్ట్రమంతటా జూనియర్‌ డాక్టర్లకు ఇటీవల బెంగాల్‌ రాష్ట్రంలోను, పక్కనే ఉన్న తెలంగాణాలోనూ స్టయిఫండ్‌ చెల్లించారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జూనియర్‌ డాక్టర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

➡️