జైల్‌భరో ఉద్రిక్తం

Jan 9,2024 23:32
అంగన్‌వాడీలపై ఎస్మా

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

అంగన్‌వాడీలపై ఎస్మా చట్ట ప్రయోగానికి వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మంగళవారం చేపట్టిన జైల్‌భరో కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నగరంలోని ఇంద్రపాలెం లాకుల నుంచి అంబేద్కర్‌ విగ్రహం నుంచి ర్యాలీగా ప్రారంభమై నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్‌లోకి చొచ్చు కెళ్లేందుకు యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, అఖిలపక్ష నాయకులకు మధ్య తోపులాటలు, వాగ్వాదం చోటుచేసుకుంది. ‘సమస్యలనైనా పరిష్కరించండి జైలులోనైనా పెట్టండి’ అంటూ పెద్దఎ త్తున నినాదాలు చేశారు. 2 టౌన్‌ సిఐ నాగేశ్వర్‌ నాయక్‌ అధ్వర్యంలో పోలీసులు అఖిలపక్ష నాయకులను అరెస్టు చేసి రెండవ పట్టణ పోలీసు స్టేషన్‌ తరలించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనర్‌ మోర్త రాజశేఖర్‌, ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే.వెం కటేశ్వర్లు, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జి, టిఎన్‌టియుసి నాయకులు గదుల సాయిబాబు, ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్‌ నరాల శివ మాట్లాడుతూ రోమ్‌ నగరం తగలడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు రాష్ట్రంలో 2 లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు పెరిగిన ధరల కనుగుణంగా వేతనాలు, సౌకర్యాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ నిరవధిక సమ్మెలు చేస్తుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆడుదాం ఆంధ్ర అంటూ ఆటలాడుకుంటున్నారని విమర్శంచారు. ఇంటి పన్నులు, విద్యుత్‌ ఛార్జీలు, చెత్త పన్ను, నిత్య వసరాలు ధరలు, పెట్రోలు డీజిల్‌ ధరలను, నిరుద్యో గాన్ని జగన్‌ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పెంపుదల చేసి ప్రస్తుతం వేతనాలు పెంచమనేసరికి ఎస్మా చాటున దాక్కుని ఆకలి కడుపులతో సమ్మె చేస్తున్న ఉద్యోగులపై నిర్భందం ప్రయో గించడం దారుణం అన్నారు. తక్షణం అంగన్‌వాడీలను ఎస్మా చట్టం పరిధిలోంచి తొలగించాలని, మున్సిపల్‌ కార్మికులకు ధరల కనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, సమగ్రశిక్ష ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, మినిమం టైమ్‌ స్కేల్‌, రెగ్యులరైజేషన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్లను గనక పరిష్కరించకపోతే ఎస్మా ప్రయోగించిన ముఖ్యమంత్రులకు పట్టిన గతే జగన్‌కి కూడా పడుతుందని హెచ్చరించారు. పోరాడే కార్మికులకు, ఉద్యోగులకు అండగా కాకినాడ అఖిలపక్షం వెన్నంటి నిలుస్తుందని, డిమాండ్లు పరిష్కరించేంతవరకు మీతో కలిసి పోరాడుతామని మద్దతు తెలిపారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌, జిల్లా కోశాధికారి మలకా రమణ, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ళ పద్మ, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చెక్కా రమణి, కెవిపిఎస్‌ జిల్లా కన్వీనర్‌ కూరాకుల సింహాచలం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కెఎస్‌.శ్రీనివాస్‌, సిఐటియు నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, ఎపి బిల్లింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రొంగల ఈశ్వరరావు, పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి మేడిశెట్టి వెంకటరమణ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దారపురెడ్డి క్రాంతి, ఐఎఫ్‌టియు జిల్లా కమిటీ సభ్యులు మల్లాడి భైరవ స్వామి, నగర కమిటీ సభ్యులు కొప్పనాతి నరసింహస్వామి తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు గంగ సూరిబాబు, చెక్కల అమృత, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు ప్రభాకర్‌ రెడ్డి, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వరలక్ష్మి, భవాని, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఓల్లు రాజబాబు, కె.వీరబాబు, ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి జిత్తుగా శ్రీనివాస్‌, జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి వర్మ, ఎఐసిసిటియు జిల్లా నాయకులు నరసరాజు పాల్గొన్నారు.

➡️