‘టెక్స్‌టైల్‌ పార్కుకు మోక్షమెప్పుడో..?’

ప్రజాశక్తి – జమ్మలమడుగు రూరల్‌ నియోజకవర్గంలోని మైలవరం మండలంలో చేనేతల ఆశాకిరణం, కలల స్వప్నం అయిన టెక్స్‌టైల్‌ పార్కు ప్రారంభమెప్పుడా అని ఎపి చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరనాల శివనారాయణ ప్రశ్నించారు. స్థానిక ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టెక్స్‌టైల్స్‌ ప్రారంభానికి నోచుకోక శిధిలావస్థలో ఉన్న భవనాలు వెక్కిరిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్నా టెక్స్‌టైల్స్‌ పార్కు భవిష్యత్‌ మారడంలేదన్నారు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. 2006లో ప్రారంభమైన టెక్స్‌టైల్‌ పార్కు నాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం హయాంలో 2009లో నిర్మాణం పూర్తయిందన్నారు. పార్కు ప్రారంభమైతే వేల చేనేతల కుటుం బాలకు జీవనోపాధి, వ్యాపార సంవృద్ధి లభిస్తుందన్నారు. ఎన్నికల్లో చేనేతల ఓట్లు కావాలి కానీ వారి పార్కు మాత్రం ఏర్పాటు చేయరని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ ఆశయాలు కొనసాగిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌ తన తండ్రి వేసిన పునాది టెక్స్‌టైల్‌ పార్కు ప్రారంభానికి ఎందుకు ప్రయ త్నించడం లేదని ప్రశ్నించారు. చేనేతలకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేకుంటే రాబోవు ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం నాయకులు పల్లా లక్ష్మీనారాయణ, శివశంకర్‌ పాల్గొన్నారు.

➡️