డాక్టర్‌ ఓబయ్యకు అవార్డు

ప్రజాశక్తి-సిఎస్‌ పురం: సిఎస్‌ పురం మండల పరిధిలోని వి బైలు గ్రామానికి చెందిన డాక్టర్‌ జమకాల ఓబయ్యకు నీసా సైంటిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు-2023 లభించింది. ఈ మేరకు లక్నోలోని సిఎస్‌ఐఆర్‌-నేషనల్‌ బొటానికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లో నేషనల్‌ ఎన్విరాన్మెంటల్‌ సైన్స్‌ అకాడమీ (నీసా) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సులో శనివారం ఆయన ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి అమ్రిత్‌ అభిజాత్‌ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. నేషనల్‌ ఎన్విరాన్మెంటల్‌ సైన్స్‌ అకాడమీ ప్రతి ఏడాది పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసిన అధ్యాపకులను గుర్తించి అవార్డులను ప్రదానం చేస్తుంటుంది. ఈ క్రమంలో జమకాల ఓబయ్యను 2023వ సంవత్సరంలో నీసా సైంటిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి ఆచార్య షకీల్‌ అహ్మద్‌ఖాన్‌ పేర్కొన్నారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ పట్టా పొందిన డాక్టర్‌ జమకాల ఓబయ్య గతంలో కూడా పలు అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఓబయ్యకు అవార్డు లభించడం పట్ల పలువురు గ్రామ పెద్దలు, ప్రజలు అభినందనలు తెలిపారు.

➡️