డ్రైవర్‌ లెస్‌ కార్ల తయారీలో సవాళ్లు

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం

గీతం సదస్సులో నార్వే నిపుణుడు బి.దుర్గాప్రసాద్‌

ప్రజాశక్తి -మధురవాడ : మానవ నియంత్రణ లేకుండా నడిచే స్వయం ప్రతిపత్తి వాహనాల తయారీపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలలో పలు సవాళ్ళు ఎదురవుతున్నాయని, అయితే వాటిని డీప్‌ లెర్నింగ్‌ ఆల్గారిధమ్స్‌, కత్రిమ మేధతో అధిగమించవచ్చునని నార్వేలోని ఎన్‌టిఎన్‌ విశ్వవిద్యాలయం పరిశోధకుడు, ప్రవాస భారతీయుడు డాక్టర్‌ బి.దుర్గాప్రసాద్‌ వెల్లడించారు. శనివారం గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ (ఐఇఇఇ) విద్యార్థి విభాగం నిర్వహించిన ‘2డి అండ్‌ 3డి విజన్‌ ఫర్‌ అటానమస్‌ డ్రైవింగ్‌’ అనే అంశంపై మాట్లాడారు. సంక్లిష్టమైన, శక్తి వంతమైన అల్గారిథమ్స్‌ ఉపయోగించడం ద్వారా స్వయంప్రతిపత్తమైన వాహనాలు సమర్ధంగా గమ్యస్థానాలను చేరుతాయన్నారు. ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులు, పాడైపోయిన రహదారులు, నీరు, మంచు నిలిచి ఉండే మార్గాలలో మనషి మాదిరిగా స్పందించి వాహనాలను నడపడానికి ప్రత్యేకంగా సెన్సార్లను అమర్చడం జరుగుతుందన్నారు. 2డి, 3డి సెన్సార్లు వాహన వేగం, దిశ, త్వరణం, దాని మార్గంలో ఉండే అడ్డంకులతో సహ అనేక రకాల సమాచారాన్ని సేకరించి వాహనంలో ఉండే ఆన్‌బోర్డు సిస్టమ్‌ విశ్లేషిస్తుందని అది పరిస్థితులకు అనుగుణంగా ప్రతిస్పందించడానికి వీలు కల్పిస్తుందన్నారు. ఇంజనీరింగ్‌ విద్యార్ధులు నూతన ఆలోచనలతో అటానమస్‌ వాహనాల డిజైనింగ్‌పై దృష్ఠి సారించాలని సూచించారు. ఇఇసిఇ విభాగం అధిపతి ప్రొఫెసర్‌ జె.బి. సెవెన్త్‌ల్లైౖన్‌ అధ్యక్షత వహించగా విద్యార్థి కౌన్సిలర్‌ డాక్టర్‌ మహ్మద్‌ కె.ఎమ్‌.చిష్టి. ఫ్యాకల్టీ సలహదారులు డాక్టర్‌ బి. సూరిబాబు, డాక్టర్‌ కె.రేణు, డాక్టర్‌ యు.రత్నకుమారి పాల్గొన్నారు.

➡️