తప్పుడు కథనంపై కోర్టు కేసు వేస్తా

Dec 15,2023 21:50

 ప్రజాశక్తి-రామభద్రపురం  :  ఇటీవల ఓ దినపత్రికలో తన మాటగా వచ్చిన వార్త తప్పుడు కథనమని, అంగన్వాడీలపై తాను ఎటువంటి అనుచిత వ్యాఖ్యలూ చేయలేదని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు వివరణ ఇచ్చారు. శుక్రవారం స్థానిక వైసిపి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మహిళలను కించపరిచేలా ప్రసంగాలు, మాటలు వాడలేదని, ఒకవేళ సందర్భానుసారం ఏం మాట్లాడినా అటువంటి వ్యాఖ్యలకు కట్టు బడే ఉంటానని స్పష్టంచేశారు. ఆరోజు కొట్టక్కిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి వెళ్తుండగా ఆ పత్రికకు చెందిన విలేకరి అంగన్వాడీ సమస్యపై అడుగగా, సానుకూలంగా స్పందించానే తప్ప ఎటువంటి అనుచిత వ్యాఖ్యలూ చేయలేదని… ఆ పత్రికలో రాసిన రాతలు తన నోటి నుంచి రాలేదని వివరణ ఇచ్చారు. నియోజకవర్గంలో ఉన్న అన్ని అంగన్వాడీల సిబ్బందికి తన ప్రవర్తన, నడవడిక, మాటతీరు తెలుసని, వారే గుర్తించాలని అన్నారు. ఇటువంటి తప్పుడు కథనాన్ని ప్రచురించిన పత్రికపై కోర్టు కేసు వేయనున్నట్లు తెలిపి ఆ వివరాలు చూపించారు. ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా మలుచుకునే ఇలాంటి చవకబారు పనుల వల్ల తమ ప్రతిష్ట మరింత రెట్టింపు అవుతుందన్నారు. ఈ సమావేశంలో ఎంపిపి లక్ష్మణరావు, జెడ్‌పిటిసి సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.పారదర్శకంగా ధాన్యం కొనుగోలు రైతు భరోసా కేంద్రాల ద్వారా అత్యంత పారదర్శకంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాగేలా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చినప్పలనాయుడు ఆదేశించారు. స్థానిక పిఎసిఎస్‌లో ఎంపిపి చొక్కాపు లక్ష్మణరావు అధ్యక్షతన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ రైతు పక్షపాతి అన్నారు. నిరంతరం రైతు శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి సరస్వతి, పిఎసిఎస్‌ అధ్యక్షులు కిర్ల చంద్రశేఖర్‌, తహశీల్దార్‌ సులోచనారాణి, సిబ్బంది పాల్గొన్నారు.

➡️