తాగునీటికి కటకట తప్పదా?

Feb 21,2024 00:08

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు,పల్నాడుజిల్లాలో తాగునీటి సమస్య పొంచి ఉంది. ప్రధానంగా నాగార్జున సాగర్‌, పులిచింతల జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడం, గత కొన్ని నెలలుగా వర్షాలు లేకపోవడం, భూగర్భజలాల నిల్వలు తగ్గిపోవడంతో నీటి ఎద్దడి తప్పేలా లేదు. గత వారంరోజుల నుంచి ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈఏడాది జులై నుంచి ఇప్పటి వరకు ఎగువ నుంచి వరద ప్రవాహం రాకపోవడం వల్ల ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. పులిచింతల జలాశయంలో గరిష్ట నీటి నిల్వ 45.77 టిఎంసిలు కాగా మంగళవారం సాయంత్రం 5.71 టిఎంసిలకు పడిపోయింది.చాలా కాలంగా వర్షాలు లేకపోవడం, కాల్వలో నీటి ప్రవాహం లేకపోవడం, జలాశయంలోకి కొత్తనీరు రాకపోవడం వల్ల పులిచింతల నుంచి వస్తున్న నీరు కూడా కలుషితంగా వస్తున్నట్టు మునిసిపల్‌ అధికారులు చెబుతున్నారు. ఇందువల్ల విజయవాడ, ఏలూరు,గుంటూరు కార్పొరేషన్లకు, పలు గ్రామాలకు ఫిల్టరేషన్‌ సమస్యలు ఏర్పడుతున్నాయని అధికారులు తెలిపారు. గత ఏడాది ఇదే సమయంలో దాదాపు 28 టిఎంసీల నీటి నిల్వ ఉంది. ఈఏడాది నీటి నిల్వ గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం తాగునీటికే కటకటలాడే పరిస్థితి ఉందని, అందువల్ల ప్రస్తుతం వివిధ దశలో ఉన్న రబీ పంటలు మొక్కజొన్న, జొన్న సాగుకు నీరు ఇవ్వలేమంటున్నారు. నాగార్జున సాగర్‌లో కూడా నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. సాగర్‌లో గరిష్ట నీటి నిల్వ 312 టిఎంసీలు కూడా ప్రస్తుతం 144 టిఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. ప్రకాశం బ్యారేజి వద్ద కూడా కనీసం 3.20 టిఎంసీల నీటి నిల్వ ఉండాల్సి ఉండగా మంగళవారం సాయంత్రం 2.71 టిఎంసీల నిల్వ మాత్రమే ఉంది. ఈనెలాఖరు కల్లా సాగర్‌ జలాశయంలో నీటి నిల్వలు డెడ్‌ స్టోరేజీకి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేగాక ఉమ్మడి జిల్లాలో 1.70 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. మిర్చికి ఇంకా కనీసం ఒక తడికి నీరు అవసరం ఉంది. ప్రస్తుతం సాగర్‌ నుంచి నీరు విడుదల చేసేపరిస్థితి లేదని అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్‌ ఆయకట్టుపరిధిలో పల్నాడుజిల్లాతోపాటు గుంటూరు జిల్లాలో తాడికొండ, పత్తిపాడు నియోజకవర్గాల్లోని దాదాపు 200 గ్రామాల్లో నీటి సమస్య ఉత్పన్నం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతిఏటా మేనెలలో నీటిఎద్దడి వస్తుందని, కానీ ఈ ఏడాది మార్చిచివరికే ఈ సమస్య రావచ్చునంటున్నారు. ప్రధానంగా భూగర్భజలాలు తగ్గిపోవడం వల్ల కూడా సమస్య తీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాల్వచివరి భూములకు నీరుచేరడం కూడాకష్టతరంగా మారింది. ఇందువల్ల చివరి ప్రాంతాలలో చెరువులను నింపడంకూడా కష్టతరంగా మారనుంది. మార్చిలో సాగర్‌ నుంచి ఐదు టిఎంసీలు తాగునీటి అవసరాలకువిడుదల చేసే అవకాశంఉందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే తెలంగాణతో కలిపి కెఆర్‌ఎంబి అనుమతితో కేటాయింపులు ఉంటాయని అధికారులు తెలిపారు.

➡️