తాగునీటికి నోచుకోని వినాయక నగర్‌ వాసులు

Mar 24,2024 18:42

17 ఏళ్లుగా ఆరుబయటే కాలకత్యాలు

పట్టించుకోని పాలకులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : జిల్లాలోని అన్ని పట్టణాలకు, గ్రామాలకు ఆదర్శంగా నిలవాల్సిన జిల్లా కేంద్రంలో ప్రజలకు మౌలిక వసతులు లేక తెల్లబోతోంది. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామని, అన్ని విధాలా అభివృద్ధి చేశామని చెబుతున్న పాలకులు శివారు కాలనీలకు కనీసం మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు కల్పించకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. 17 ఏళ్లుగా మరుగుదొడ్లు, తాగునీరు లేకపోగా, చిన్నారులు చదువు కోసం కూడా మూడు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఇది ఎక్కడో మారు మూల గ్రామంలో ఉన్న దుస్థితి కాదు,జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌కు దగ్గరలో ఉన్న వినాయక నగర్‌ వాసుల దుస్థితి.వినాయకనగర్‌ కాలనీ ఏర్పడి సుమారుగా 17 ఏళ్లు అయ్యింది. ఎన్నికలప్పుడు మినహా మిగతా రోజుల్లో ఈ కాలనీవైపు ప్రజాప్రతినిధులు, పాలకులు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఫలితంగా కాలనీ వాసులు మరుగుదొడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాలనీలో 30 నివాసాలు ఉన్నాయి. చుట్టూ పక్కల అన్ని లే అవుట్‌ స్థలాలే. వినయకనగర్‌ వెనుక ఉన్న లే అవుట్‌ వ్యాపారం కోసం ఒక మట్టి రోడ్డును లే అవుట్‌ యాజమాన్యం వేసింది తప్ప పాలకులు మాత్రం పట్టించుకోలేదు. మరో వైపు సిపిఎం అధ్వర్యంలో 17 ఏళ్లుగా పోరాడితే కరెంట్‌, ఇంటి పన్నులు వేశారు. రోడ్లు, కాలువలు,.తాగునీటి సరఫరా వంటి సౌకర్యాల కల్పనకు ఇక్కడి ప్రజలు నోచుకోలేదు.తాగునీటికి కొద్ది దూరంలో ఉన్న ఎల్‌బిజి నగర్‌లో ఉన్న బోరు తప్ప మరో అధారం లేదు. ఎల్‌బిజి నగర్‌ వాసులకూ అదే బోరు దిక్కు. గతంలో తాటిపూడి నుంచి విజయనగరం వాసులకు వచ్చే ప్రధాన పైప్‌ లైన్‌ లీకేజీ నీటిని కొంతకాలం వీరంతా పట్టుకున్నారు. లీకేజీని మూసివేయడంతో ఆ నీటికి కూడా నోచుకోని దుస్థితి నెలకొంది. మరోవైపు మరుగుదొడ్లు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇద్దరు ముగ్గురు కలిసి బయట చెరువులోకి, లేదా బయట ఉన్న ఓపెన్‌ స్థలంలోకి వెళ్లి కాల కృత్యాలు తీర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇళ్ల పట్టాల కోసం సిపిఎం ఆధ్వర్యాన ఈ పేదలంతా పోరాటం చేశారు. ఆ సమయంలో పట్టాలు ఇస్తామని చెప్పిన పాలకులు తరువాత వాటి గురించి పట్టించుకోలేదు. పిల్లలు చదువులకు మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న రామవరం హైస్కూలుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు పేదలకు న్యాయం చేయాల్సిన కొంతమంది నాయకులు పేదలు ఇళ్లను కబ్జా చేసి ఆక్రమించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సౌకర్యాలు కల్పించకపోగా అక్కడినుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎన్నికల్లో ఓట్లు కోసం వచ్చే పాలకులు వినాయకనగర్‌ వాసుల దుస్థితికి ఎటువంటి హామీలిచ్చి ఆదుకునే ప్రయత్నం చేస్తారో వేచి చూడాల్సిందే.

తాగునీటి కష్టాలు తీర్చండి

17ఏళ్ల నుంచి తాగునీటి సరఫరా లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఎల్‌బిజి నగర్‌లో ఉన్న ఒకే ఒక్కబోరు నుంచి నీరు తెచ్చుకుంటున్నాం. నగరపాలక సంస్థ అధికారులు,పాలకులు కనీసం మా నీటి కష్టాలు గురుంచి పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా నీటి కష్టాలు తీర్చి ఆదుకోవాలి.

కర్రి దేముడమ్మ, వినాయక నగర్‌

కనీస సౌకర్యాలు కల్పించండి

అధికారులు, పాలకుల దృష్టికి మా సమస్యలను ఎన్నోసార్లు చెప్పుకున్నాం. చెప్పినప్పుడల్లా వినడం తప్ప మా గోడు పట్టించుకోవడం లేదు. నగరంలో పలుచోట్ల రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నారు. శివారు కాలనీలను మాత్రం కనీసం పట్టించుకోవడం లేదు. మరుగుదొడ్లు, తాగునీరు, రోడ్లు వంటి సౌకర్యాలు కల్పించాలి.

సత్యం అప్పలనాయుడు, వినాయక నగర్‌

➡️