తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి నిధులు

ప్రజాశక్తి-రేపల్లె: రేపల్లె మండల పరిధిలోని తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి 4 కోట్ల 74 లక్షల 39 వేల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసి ప్రారంభించినట్లు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు తెలిపారు. మండలంలోని పెనుమూడి, చాట్రగడ్డ, నల్లూరి నార్త్‌ కామరాజు గడ్డ నార్త్‌, సింగుపాలెం, విశ్వేశ్వరం, చోడయపాలెం, పిరాట్లంక, చెన్నుపల్లి వారిపాలెం, రాజు కాల్వా, మోళ్లగుంట, తుమ్మల, కైతేపల్లి, ఊలుపాలెం, అరవపల్లి, గుడ్డికాయ లంక, గ్రామాలలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మోపిదేవి మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి చేశారని చెప్పారు. పేదలకు నివేశన స్థలాలను శాశ్వత రిజిస్ట్రేషన్‌ చేసి అందించినట్లు తెలిపారు. గ్రామ సచివాలయ భవనాలు, సిసి రోడ్లు, హెల్త్‌ సెంటర్లు ఆర్‌బికేలతో పాటు ప్రజల తాగునీటి అవసరాలకు ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ప్లాంట్లను పైప్‌లైన్‌ నిర్మాణాలను చేపట్టినట్లు తెలిపారు. సంక్షేమ పథకాలలో కులమత భేదాలు చూడకుండా అర్హత ప్రామాణికంగా అనేక కుటుంబాలకు సాయం అందించినట్లు చెప్పారు. రానున్న 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బూడా చైర్మన్‌ దేవినేని మల్లికార్జునరావు నియోజకవర్గం సమన్వయకర్త ఈవురి గణేష్‌, రూరల్‌ కన్వీనర్‌ గాదె వెంకయ్య బాబు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️