తుపాన్‌తో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీతారాం, చిత్రంలో జిల్లా కార్యదర్శి కిరణ్‌ తదితరులు

ప్రజాశక్తి-చింతూరు

మిచౌంగ్‌ తుపాను కారణంగా ఏజెన్సీ ప్రాంతంలో దెబ్బతిన్న అన్ని రకాల పంటలకు సర్వేలు నిర్వహించి, బాధిత రైతులందరికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి వరి, నువ్వు, పత్తి పంటలను వేశారని, పంటలు కోతకొచ్చిన సమయంలో వరి పైరు తుఫాను కారణంగా సర్వనాశనమైందని, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు సకాలంలో వర్షాలు పడక పంటలు దిగుబడి తగ్గిపోగా, ఇప్పుడు అకాల వర్షాలకు పంటలు పాడైపోయాయని పేర్కొన్నారు. చింతూరు మండలంలో 4114 హెక్టార్ల వరి, 440 హెక్టార్ల పత్తి పంట సాగు చేయగా, తుఫాను కారణంగా ఆ పంటలు పూర్తిగా దెబ్బ తినడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలిందని వాపోయారు. తక్షణమే ఆయా పంటల నష్టంపై వ్యవసాయ శాఖ సర్వేలు నిర్వహించి నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పన కిరణ్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, పల్లపు వెంకట్‌, చింతూరు మండల కార్యదర్శి సీసం సురేష్‌, కూనవరం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, ఎటపాక మండల కార్యదర్శి ఐ.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.నష్ట పరిహారం చెల్లించాలివిఆర్‌.పురం : ఏజెన్సీలో తుఫాన్‌ కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సొసైటీ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ రక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమైందని విమర్శించారు. వరి, మినుము, పత్తి, మిర్చి, పెసర తదితర పంటలకు నష్టం వాటిల్లిందని, అధికారులు సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో చిన్న, సన్నకారు, రైతులను ఏకం చేసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

➡️