తొలగని ‘కాంట్రాక్ట్‌’ వెతలు

Mar 7,2024 21:05

ప్రజాశక్తి – కడప ప్రతినిధికాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిరసన సెగల మధ్య నడుస్తోంది. ప్రభుత్వం రెండు నెలల కిందట జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల, మానసిక, కేన్సర్‌కేర్‌, పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాల పరిధిలోని 14 కేటగిరీలకు చెందిన 196 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల యంత్రాంగం నోటిఫికేషన్‌ విడుదల నుంచి భర్తీ ప్రక్రియ వరకు అన్నీ తానై చేపట్టింది. రివైజ్డ్‌ ఫైనల్‌ లిస్టు పెట్టకుండా సెలెక్షన్‌ లిస్టు ప్రకటించడంపై ఆందోళన నెలకొంది. రిజర్వేషన్ల గుర్తింపు దగ్గర నుంచి, ఆయా పోస్టులకు అర్హతలు నిర్ధారించడం వరకు విఫలమైందనే ఆరోపణలు వెల్లు వెత్తాయి. ఓ మెడిసిన్‌ ఫిజిసిస్ట్‌ ఉద్యోగార్థి న్యూక్లియర్‌ మెడిసిన్‌ ఫిజిసిస్ట్‌, మెడిసిన్‌ ఫిజిసిస్ట్‌ పోస్టులకు దరఖాస్తు చేశారు. విచిత్రమేమిటంటే తను చదవని చదువుకు సంబంధించిన పోస్టుకు సెలెక్షన్‌ కమిటీ ఎంపిక చేయడం గమనార్హం. మొదటి నుంచి నోటిఫికేషన్‌లో తప్పిదం దొర్లిందంటూ పరిశీలన చేయాలని వాపోతున్నారు. అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. సెలెక్షన్‌ లిస్టులో ఎంపికైన ఉద్యోగానికి సంబంధించిన సర్టిఫికెట్లు లేవని వాపోతున్నారు. కర్నూలు, గుంటూరు వైద్య కళాశాలలు తప్పును సరిచేసి రీనోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేశాయని వాపోతున్నారు. బ్లడ్‌ బ్యాంకు టెక్నీషియన్‌ కేటగిరీలో రిజర్వేషన్‌ మార్చేశారనే వాదన వినిపిస్తోంది. ఎస్‌సి కేటగిరీ అభ్యర్థికి ఒసి కేటగిరీలో ఎంపిక చేయడం, ఎస్‌సి కేటగిరీని వేకెంట్‌ పెట్టడమేమిటనే విమర్శ వినిపి స్తోంది. కేన్సర్‌కేర్‌లో ల్యాబ్‌ విభాగానికి సంబంధించి మెరిట్‌నే మార్చేశారనే వాదన వినిపిస్తోంది. ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ పోస్టులకు డిగ్రీని అర్హతగా ప్రకటించారు. పీజీ (డిప్లమా) చేసిన వారిని అర్హులుగా చేయడంలో అర్థం లేదని వాపోతున్నారు. రాష్ట్రంలోని రాజమండ్రి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అర్హులుగా తీసుకున్నారని ఆధారాలతో సహా చెబుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. తమ అభ్యంతరాల పట్ల స్పీకింగ్‌ ఆర్డర్స్‌ ఇవ్వకుండా ఎలా భర్తీ చేస్తారని నిరసన తెలుపుతున్నారు. ఇటువంటి తప్పిదాలను సవరించాలని కోరుతూ జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి కళాశాల ఎదుట పలువురు ఉద్యోగార్ధులు గురువారం ధర్నా నిర్వహించారు. రివైజ్డ్‌ ఫైనల్‌ లిస్టును ప్రకటించిన అనంతరం పోస్టులను భర్తీ చేయాలని, తప్పులను సవరించిన తర్వాత ముందుకెళ్లాలని డిమాండ్‌ చేయడం విశే షం. ఇప్పటికైనా సర్వజన ఆస్పత్రి కళాశాల యాజమాన్యం సానుకూల వాతావరణంలో సమస్యల్ని పరిష్కరించిన అనంతర రిక్రూట్‌మెంట్‌ నిర్వహించాలని కోరుతున్నారు. లేనిపక్షంలో నోటిఫికేషన్‌, రిక్రూట్‌మెంట్‌ తీరుతెన్నులను సవాల్‌ చేసి తీరుతామని ప్రకటించడం గమనార్హం. రిక్రూట్‌మెంట్‌ అవకతవకల వ్యవహారం డిప్యూటీ సిఎం దృష్టికి వెళ్లడంతో సీరియస్‌గా స్పందించినట్లు తెలుస్తోంది.

➡️