దోచుకోవడమే వైసిపి నేతల నైజం

ప్రజాశక్తి-పోరుమామిళ్లవైసిపి ప్రభుత్వంలో ఎక్కడ ఏమి కనిపించినా దోచుకోవడం, దాచుకోవడమే ఆ పార్టీ నాయకుల నైజన మనిటిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా బద్వేల్‌ నియో జకవర్గం పోరుమామిళ్ల గ్రామంలో పార్టీ కార్యకర్త మెహ బూబ్‌చాంద్‌, బలిజకోటలో మునెళ్లి అక్కమ్మ కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించి ఓదార్చారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక వారు గుండెపోటుతో మృతి చెందారు. వారి చిత్రపటాలకు ఆమె నివాళులు అర్పించారు. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం కింద చెక్కులు అందజేశారు. పరామర్శల అనంతరం పోరుమామిళ్ల ప్రజలతో భువనేశ్వరి మాట్లాడుతూ ప్రతి రోజూ మీ పొలాలు, స్థలాలు ఉన్నాయో లేదో చూసుకోవాలన్నారు. వైసిపి నేతలకు ఏది కనిపించినా దోసేస్తున్నారన్నారు. జగన్మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలన మొత్తం దోపిడీల పర్వంగా కొనసాగిందే తప్ప, సామాన్యులకు లాభకరమైన పనులేవీ వైసిపి ప్రభుత్వం చేయలేదని పేర్కొన్నారు. వైసిపి పాలనలో కల్తీమద్యం, ఇసుక దోపిడీ, భూ కబ్జాలు, గంజాయి, డ్రగ్స్‌, మహిళలపై దాడుల్లో ఎపిని భారతదేశంలో జగన్మోహన్‌రెడ్డి మొదటి స్థానంలో నిలబెట్టారన్నారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే అగ్రస్థానంలో ఎపిని నిలబెట్టారని తెలిపారు. వైసిపి పాలనలో టిడిపి ప్రభుత్వం తెచ్చిన కంపెనీలన్నీ ప్రక్కనున్న రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయని పేర్కొన్నారు. ఎపికి రాజధాని లేకుండా చేసి రాష్ట్రం పరువు తీశారన్నారు. రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన ఎన్నికలని తెలిపారు. దీనికి ప్రతి కార్యకర్త, నాయకుడు సంసిద్ధంగా ఉండాలన్నారు. వైసిపి చేసే అరాచకాలను ధైర్యంగా తిప్పికొట్టి, 2024 ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో దుర్మార్గుల పాలనను అంతం చేయాలని పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు బాగుంటుందన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలన్నీ అమలు చేస్తారని తెలిపారు. సంక్షేమంతో పాటు భవిష్యత్తుకు కూడా గ్యారంటీ ఉంటుందనే విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా గుర్తుపెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, కడప టిడిపి అభ్యర్థి మాధవి, యువ నాయకులు రితీష్‌రెడ్డి పాల్గొన్నారు. అక్రమ కేసులకు భయపడవద్దురైల్వేకోడూరు: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్రమ కేసులకు భయపడవద్దని కార్యకర్తలకు అండగా ఉంటామని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా భువనేశ్వరి బద్వేల్‌కు వెళుతూ మార్గమధ్యలో పట్టణంలోని టిడిపి కార్యాలయం వద్ద ఆ పార్టీ సీనియర్‌ నాయకులు కస్తూరి విశ్వనాథ నాయుడు, మాచినేని విశ్వేశ్వర నాయుడు ఆధ్వర్యంలో టిడిపి నాయకులను కలిశారు. ముక్కావారిపల్లె వద్ద టిడిపి ఇన్‌ఛార్జి ముక్కా రూపనందరెడ్డి, ఆయన సతీమణి వరలక్ష్మి భువనేశ్వరికి ఘన స్వాగతం పలికారు. రూపానందరెడ్డి ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించి 53 రోజులు జైలులో ఉంచారని తెలిపారు. అక్రమ అరెస్టును జీర్ణించుకోలేని కార్యకర్తలు తీవ్ర మనస్థాపానికి గురై మృతి చెందాలని చెప్పారు. అలాంటి వారి కుటుంబాలను తాను పరామర్శించి మనో ధైర్యాన్ని కల్పిస్తున్నానన్నారు. అనంతరం రూపానందరెడ్డి నివాసంలో భువనేశ్వరి బృందానికి భోజన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కెకె.చౌదరి, ముక్కా సాయి వికాస్‌రెడ్డి, సర్పంచ్‌ అరవ శ్రీధర్‌, వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌ : నారా భువనేశ్వరికి వెంకటరాజంపేట వద్ద టిడిపి రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షులు చమర్తి జగన్‌మోహన్‌రాజు, రాజంపేట ఇన్‌ఛార్జి బత్యాల చెంగల రాయుడు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️