నాణ్యతకు తిలోదకాలు డివైడర్లు

ప్రజాశక్తి – వీరఘట్టం : మండల కేంద్రమైన వీరఘట్టం ప్రధాన రహదారి విస్తీర్ణ పనులు నాణ్యత లోపంతో జరుగుతుండడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపడుతున్నట్టు అటు అధికారులు, పాలకులు చెబుతున్నా ఆచరణలో మాత్రం శూన్యమని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇందుకు నిదర్శనం ప్రధాన రహదారికి మధ్య నిర్మిస్తున్న డివైర్ల నిర్మాణంలో అధికారులు నాణ్యతకు తిలోదకాలిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వట్టిగెడ్డ నుంచి స్థానిక విశాఖ గ్రామీణ బ్యాంకు వరకు నిర్మించిన డివైర్‌ ఒకవైపు నిర్మిస్తుండగా, మరో వైపున పెచ్చులూడిపోతున్నాయి. వీటిని బయటకు కనబడనీయకుండా అప్పటికప్పుడు ప్లాస్టింగ్‌ చేస్తున్నారు. దీనంతటికీ అధికారుల పర్యవేక్షణా లోపమేనని స్థానికులు ఆరోపిస్తున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో గుత్తేదారులు వారికి ఇష్టమొచ్చినట్టు నాణ్యతాలోపంతో పనులు చేపడుతున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులను పర్యవేక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

➡️