నిధులు మళ్లిస్తే పంచాయతీల అభివృద్ధి ఎలా?

ప్రజాశక్తి-ఆనందపురం : సర్పంచుల సమస్యలు పరిష్కరించాలని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వానపల్లి లక్ష్మి పేర్కొన్నారు. ఆనందపురం మండలంలోని బోయపాలెం గ్రామంలో ‘గ్రామాల అభివృద్ధికై సర్పంచుల సమర సంఖారావం’ పేరుతో ఎపి సర్పంచుల సంఘం, ఎపి పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ ఆధ్వర్యాన శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పంచాయతీ హక్కులను వైసిపి ప్రభుత్వం పూర్తిగా కాలరాసిందన్నారు. నిధులను ఇతర పనులకు దారి మళ్లిస్తే పంచాయతీలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయని ప్రశ్నించారు. ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపించారు. సర్పంచుల్లో 90 శాతం వైసిపికి చెందిన వారే ఉన్నారని, వారు కూడా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. పంచాయతీల్లో వీధి దీపాలు, కాలువల శుభ్రం వంటి కనీస పనులు కూడా చేపట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలకు వచ్చిన 14, 15 ఫైనాన్స్‌ నిధులు సుమారు రూ.8629 కోట్లును దారి మళ్లించి పంచాయతీల అభివృద్ధిని నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఎపి పంచాయతీరాజ్‌ చాంబర్‌ ఆధ్వర్యాన ఈ నెల 10వ తేదీన శ్రీకాకుళంలో ప్రత్యేక సమావేశం ఉందని, ఆ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు హజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపి పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ ఉపాధ్యక్షుడు వానపల్లి ముత్యాలరావు, అనేపు రామకృష్ణనాయుడు, తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు కురిమిన లీలావతి, నాయకులు మొల్లి లక్ష్మణరావు, పిళ్లా వెంకటరావు, మీసాల సత్యనారాయణ పాల్గొన్నారు.

 

➡️