నిరవధిక సమ్మెలోకి సర్వశిక్ష ఉద్యోగులు

Dec 20,2023 23:35
ప్రతిపక్ష నాయకుడిగా

ప్రజాశక్తి – కాకినాడ

డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌లో పనిచేసే సర్వశిక్ష అభియాన్‌ 18 రకాల క్యాడర్లకు చెందిన ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా కాకినాడ ధర్నా చౌక్‌ వద్ద నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు(ఐవి) పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర సందర్భంగా సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగులకు ఇచ్చిన రెగ్యులరైజ్‌ హామీని సాధించుకునేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చి ఐదేళ్లు కావస్తున్నా ఉద్యోగుల, కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో జగన్మోహన్‌ రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. అంగన్‌వాడీల సమ్మె సందర్భంగా మీరు చెప్పింది మేము చేయాలా? అని మంత్రి మాట్లాడుతుంటే మీకెందుకు ఓటేయాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినా దురహంకారం, దొర అహంకారం వల్ల కెసిఆర్‌ అధికారాన్ని కోల్పోయాడని జగన్‌ గుర్తుంచుకోవాలన్నారు. నిత్యవసర సరుకులు ధరలు విపరీతంగా పెంచుతున్న ప్రభుత్వానికి ఉద్యోగుల జీతాలు పెంచాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. నెలల తరబడి జీతాలు పెండింగ్లో పెడితే కుటుంబ పోషణ ఎలా అని ప్రశ్నించారు. సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగాల్సిన పరిస్థితులకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని, తక్షణం ఉద్యోగుల డిమాండ్లన్నీ పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సమ్మె శిబిరాన్ని సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దువ్వా శేషబాబ్జి, చెక్కల రాజ్‌కుమార్‌ మద్దతు తెలిపారు. యునైటెడ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షులు నగేష్‌, సిఐటియు నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, స్టూడెంట్‌ జెఎసి నాయకులు పండు మద్దతుగా మాట్లాడారు. సామర్లకోట రూరల్‌ సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగులు నిరసన తెలిపి ఎంఇఒ వై.శివరామకృష్ణయ్యకు సమ్మె నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా జెఎసి నాయకులు ఎం.సుబ్రహ్మణ్యం, ఎ.వీర్రాజు, శ్రీనివాసరావు, ప్రశాంతి, ఆర్‌.విజరుకుమారి, కె.నాగమణి, కె.కామేశ్వరరావు మాట్లాడారు. తమకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ”సమాన పనికి సమాన వేతనం” ఇవ్వాలని వారు కోరారు. గండేపల్లిలో సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెలోపాల్గొన్నారు. వీరి సమ్మెకు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి.

➡️