నీటి మోటార్ల కోసం సోలార్‌ ప్లాంటు

Jan 24,2024 00:45

ప్రజాశక్తి – గుంటూరు : సౌర విద్యుత్‌ వినియోగం ద్వారా పర్యావరణ హితంతో పాటు, ఖర్చులూ తగ్గించుకొని ఆదాయం పెంచుకునే అవకాశం ఉందని నగర కమిషనర్‌ కీర్తి చేకూరి అన్నారు. సంగంజాగర్లమూడి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌లో ఏర్పాటు చేసిన సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ నిర్వహణపై కమిషనర్‌ క్యాంప్‌ కార్యాలయంలో ఇంజినీరింగ్‌ అధికారులతో మంగళశారం సమీక్షించారు. గుంటూరు నగరపాలక సంస్థ సౌర విద్యుత్‌ వినియోగాన్ని ప్రోత్సహిస్తుందని, అందులో భాగంగా సంగంజాగర్లమూడి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌లో యునిడో సహకారంతో 3.5 ఎకరాల్లో సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసిందని చెప్పారు. సుమారు రూ.4.75 కోట్లతో 500 కిలోవాట్ల సామర్ధ్యంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ రోజుకు సరాసరి 2 వేల యూనిట్ల విద్యుత్‌ను ఉత్త్పత్తి చేస్తుందన్నారు. జాగర్లమూడి నుండి గుంటూరు నగరానికి తాగునీరు సరఫరా చేసే మోటార్ల రన్నింగ్‌ కోసం రోజుకు 650 నుండి 1300 యూనిట్లను వినియోగించుకొని మిగిలిన యూనిట్లను గ్రిడ్‌కు అమ్ముతామని తెలిపారు. సోలార్‌ ప్లాంట్‌ ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను మోటార్ల రన్నింగ్‌కు వినియోగించడం ద్వారా రోజుకు సుమారు రూ.12,350 ఖర్చులు తగ్గుతుండగా, మిగిలిన విద్యుత్‌ అమ్మకం ద్వారా రోజుకు సుమారు రూ.4,555 ఆదాయం వస్తుందని వివరించారు. రానున్న వేసవిలో ఆదాయం పెరిగే అవకాశం ఉందన్నారు. ప్లాంట్‌ నిర్వహణ 15 ఏళ్లు కాంట్రాక్ట్‌ సంస్థే భాధ్యత తీసుకుంటుందని, మరో పదేళ్లు పొడిగించుకునే అవకాశం ఉందని తెలిపారు. ప్లాంట్‌ నుండి ప్రతిరోజూ ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌, వినియోగం, అమ్మకం తదితర వివరాలను ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌లో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు వల్ల చెరువులో నీటి ఆవిరి శాతాన్ని తగ్గించవచ్చని, ప్లాంట్‌ ఏర్పాటుకు అదనంగా భూమి కేటాయింపు అవసరం లేదని అన్నారు. రానున్న కాలంలో నగరపాలక సంస్థ ఖాళీ స్థలాల్లో ప్లాంట్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

➡️