నూతన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ

నూతన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ

ప్రజాశక్తి-అమలాపురంపేదలు ఎవరూ వైద్యం నిమిత్తం అప్పుల పాలు కారాదనే ఉద్దేశంతో వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ పథక పరిమితిని రూ.25 లక్షల వరకు పెంచుతూ సువర్ణ అధ్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికిందని కలెక్టర్‌ హి మాన్షు శుక్లా పేర్కొన్నారు. సోమవారం ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి 26 జిల్లాల కలెక్టర్లు, ఆరోగ్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నూతనంగా రూపొందించిన ఫీచర్స్‌తో స్మార్ట్‌ ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ, 2024 జనవరి ఒకటో తేదీ నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ గతంలో రూ.ఐదు లక్షలు ఉండే ఈ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం మానవతా దక్పథంతో రూ.25 లక్షల వరకు పెంచిందన్నారు. క్యాన్సర్‌ వ్యాధిపై పరిమితి లేదని తెలిపారు. ప్రతి పేద కుటుంబం ఒక ఏడాది కాలంలో రూ.25 లక్షల వరకు వైద్య సేవలు వరకు వైద్య సేవలు పొందవచ్చన్నారు. వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన సంస్కరణలను ప్రవేశపెట్టిందని చెప్పారు. ప్రతి ఇంటికీ ఆరోగ్య సేవలు అందేలా ప్రణాళికను రూపొందించి అమలు చేస్తోందన్నారు. కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌, ఎఎన్‌ఎంలు సిబ్బందితో రెండు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటికీ వెళ్లి కొత్త ఫీచర్స్‌తో ఉన్న స్మార్ట్‌ ఆరోగ్యశ్రీ కార్డులను సరఫరా చేసి, ఆరోగ్యశ్రీ యాప్‌, దిశ యాప్‌లను మహిళా పోలీసుల ద్వారా డౌన్లోడ్‌ చేయించాలన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి అన్న అంశంపై ఆడియో విజువల్‌ ద్వారా భౌతికంగా అవగాహన కల్పించే కార్యక్రమం వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్‌ హాస్పటల్‌ సంఖ్య కూడా 2,513 వరకు రాష్ట్ర ప్రభుత్వం విస్తరించిందన్నారు. గతంలో నిర్వహిం చిన ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో రిఫరల్‌ కేసులను ఫాలోఅప్‌ చేయాలని ఆదేశించారు. అనంతరం ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు కొత్త ఫీచర్స్‌తో రూపొందించిన స్మార్ట్‌ ఆరోగ్యశ్రీ కార్డులను వారు పంపిణీ చేశారు. ఎస్‌పి ఎస్‌.శ్రీధర్‌, ఎంఎల్‌ఎసి కుడిపూడి సూర్యనారాయణరావు, ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు, హితకారిణి సమాజం చైర్మన్‌ కాశీ బాలముని కుమారి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి సత్య నాగేంద్రమణి, డిసిహెచ్‌ఎస్‌ పద్మశ్రీరాణి, డిఎంహెచ్‌ఒ ఎం.దుర్గారావు పాల్గొన్నారు.

➡️