నూతన రాజకీయ సంస్కృతి కోసమే విరాళాల సేకరణ

Feb 2,2024 21:21

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : రాష్ట్రంలో ప్రజలను మోసగించి, డబ్బులిచ్చి ఓట్లు వేయించుకొనేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్న నేటి పరిస్థితుల్లో వాటికి భిన్నంగా సిపిఎం ప్రజల వద్దకే విరాళాల కోసం వెళ్లడం సాహసోపేతమైన చర్యని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో నూతన రాజకీయ సంస్కృతిని ప్రవేశపెట్టేందుకే జోలిపట్టి వీధుల్లో తిరిగి ప్రజల నుంచి విరాళాలు వసూలు చేస్తున్నామని తెలిపారు. విజయనగరంలోని కలెక్టర్‌ కూడలి, కనపాక ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఇంటింటికీ వెళ్లి సిపిఎం నాయకులు, కార్యకర్తలు విరాళాలు సేకరించారు. రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు జోలి పట్టి ప్రతి ఇంటికి, షాపునకు వెళ్లి విరాళాలు అభ్యర్థించడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలు వ్యాపారంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాన్ని ప్రజా సేవకు కేంద్రంగా మార్చాలనే ఈ ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మిగతా రాజకీయ పార్టీలు మాదిరిగా కార్పొరేట్ల వద్ద, ఎన్నికల బాండ్ల రూపంలో నిధులు తీసుకోవడం లేదని, ప్రజల కోసం పనిచేస్తున్నాం కనుక వారి వద్దకే వెళ్లి విరాళాలు వసూలు చేస్తున్నామని తెలిపారు. పోరాటాలను బట్టి ఓట్లు వేయాలని అడుగుతామే తప్ప డబ్బులిచ్చి ఎన్నికల్లో గెలిచే సంస్కృతి తమ పార్టీకి లేదన్నారు. ప్రజలంతా ఆదరించి విరాళాలు ఇవ్వాలని కోరారు. బడ్జెట్‌ సమావేశాలు ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికలుగా కాకుండా ప్రభుత్వ నిర్ణయాలకు ఆమోదం ముద్ర వేసే మూగజీవులుగా, ఎలాంటి అధికారాలూ లేని నిస్సత్తువ కలిగిన చెత్తబుట్టలుగా చేసేందుకు ప్రయత్నం జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యేలకు, అసెంబ్లీకి పవర్‌ లేదని, ప్రధాని, ముఖ్యమంత్రి చేతోల్లో అధికారాలన్నీ కేంద్రీకృతం చేస్తున్నారని అన్నారు. ఫలితంగా ప్రజల్లో అసంతృప్తి, తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఒక్క రాయితీ కూడా ఇవ్వ ఇవ్వలేదన్నారు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాలూ తమ సమస్యల పరిష్కారంపై ఆందోళనతో ఉన్నారని, ఈ ఐదేళ్లలో జగన్‌ ప్రభష్ట్రత్వం సమస్యల పరిష్కారంలో విఫలమైందని అన్నారు. కనీసం ఆఖరి నిముషంలోనైనా పోరాడి కొన్ని హామీలైనా తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రజలంతా ఉన్నారని . తెలిపారు. ఇప్పుడు పరిష్కారం కాకపోతే మళ్లీ ఐదేళ్ల వరకు తమను ఎవరూ పట్టించుకోరని నిరాశతోనే ఆందోళనలోకి వస్తున్నారని అన్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో ప్రజా సమస్యలు పరిష్కారం దిశగా నిర్ణయాలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజా స్వామ్య విలువల పునరుద్దరణకు అసెంబ్లీలో గాని, పార్లమెంట్‌లో గాని వామపక్షాల ప్రతినిధులు ఉంటేనే నిండుదనం వస్తుందని, అందువల్ల ప్రజలు వామపక్షాలను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు, నాయకులు పి.రమణమ్మ, కె.సురేష్‌, ఎ.జగన్మోహన్‌, బి.రమణ, వి.లక్ష్మి, ఆర్‌.ఆనంద్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️