నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

Feb 29,2024 21:51

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లాలోని మొత్తం 136 కళాశాలలకు చెందిన 32,757 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. మార్చి 1వ తేదీన ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం, రెండో తేదీన ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభమవుతాయి. చివరి పరీక్ష మార్చి 20వ తేదీన ముగుస్తుంది. నిర్ధారిత తేదీల్లో ప్రతిరోజు ఉదయం9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఒక్కో పరీక్ష కేంద్రంలో సరాసరిన 420 మంది విద్యార్థులకు సరిపడా 12 గదులను ఏర్పాటు చేశారు. ప్రతి గదిలో 32మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో 31 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, 19 హైస్కూల్‌ ప్లస్‌, 6 ఏపీ మోడల్‌ పాఠశాలలు, 8 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, 4 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలలు, ఒక బీసీ వెల్ఫేర్‌ గురుకుల కళాశాలతో పాటు 67 ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలో జనరల్‌ కోర్సుకు సంబంధించి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో 13,797 మంది, ద్వితీయ సంవత్సరంలో 14,428 మంది విద్యార్థులతో కలిపి మొత్తం 28,225 మంది విద్యార్థులు చదువుతున్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ కోర్సుకు సంబంధించి మొదటి సంవత్సరంలో 2,108 మంది, ద్వితీయ సంవత్సరంలో 2,424 మందితో కలిపి మొత్తం 4,532 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పరీక్షలకు ఎటువంటి అవాంతరాలు చోటుచేసుకోకుండా 600మంది ఇన్విజిలేటర్ల నియామకం పూర్తిచేశారు. అదేవిధంగా ఇది వరకే గుర్తించిన పలు సమస్యాత్మక పరీక్ష కేంద్రాలలో 500 సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేసి, వాటి ద్వారా జిల్లా కేంద్రంలోని కంట్రోల్‌ రూమ్‌ నుంచి పరీక్షల నిర్వహణను పర్యవేక్షించనున్నారు.అన్ని జాగ్రత్తలు తీసుకున్నాంజిల్లా వత్తి విద్యాధికారి సయ్యద్‌ మౌలా జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి మార్చి 20వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్‌ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా వత్తి విద్యాధికారి సయ్యద్‌ మౌలా తెలిపారు. ఈమేరకు ఆయన గురువారం తన కార్యాలయంలో ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణ పరిశీలకులు దుర్గాప్రసాదరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని 28,225 మంది జనరల్‌, 4,532మంది ఒకేషనల్‌ విద్యార్థులకు ఇదివరకే హాల్‌ టికెట్ల పంపిణీ పూర్తి చేశాం. ప్రతి పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, అసౌకర్యానికి గురికాకుండా ఉండేలా ఏర్పాట్లు చేశాం. ముఖ్యంగా ఆయా పరీక్షా కేంద్రాల వద్ద ఆరోగ్య సిబ్బంది, మంచి నీటిఏర్పాటు, పరీక్ష గదిలో మంచి గాలి, వెలుతురు సోకే విధంగా చర్యలు తీసుకున్నాము. జంబ్లింగ్‌ విధానంలో జరిగే ఈ పరీక్షల్లో కాపీయింగ్‌ జరగకుండా ప్రత్యేక ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ బందాలను ఏర్పాటు చేశాము. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా జిల్లా కేంద్రంలోని కంట్రోల్‌ రూమ్‌ నుంచి తనతో పాటు సంబంధిత అధికారులు పరీక్ష ముగిసేంత వరకు మూడు గంటలపాటు నిరంతరాయంగా పర్యవేక్షిస్తాం. విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. విద్యార్థులు ఎటువంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలను రాయడంతో పాటు, మంచి మార్కులు సాధించి ఈ ఎడాది చిత్తూరు జిల్లాకు ఉన్నత స్థానాన్ని, పేరు ప్రఖ్యాతలు తేవాలని జిల్లా వత్తి విద్యాధికారి సయ్యద్‌ మౌలా కోరారు.ఇంటర్మీడియట్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు పుంగనూరు: ఇంటర్మీడియట్‌ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కస్టోడియన్‌ రెడ్డప్ప చెప్పారు. మార్చి 1వ తేదీ నుండి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు కస్టోడియన్‌ గురువారం చెప్పారు. ఈసందర్భంగా పట్టణంలో బసవరాజ బాలురు జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, ఎంసివి జూనియర్‌ కళాశాలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి తరగతి గదికి సీసీ కెమెరాలు నిఘాలు పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు 989, రెండవ సంవత్సరం విద్యార్థులు 702మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. సోమల: మండల కేంద్రమైన సోమల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మార్చి 1వ తేదీ నుండి జరగనున్న ఇంటర్‌ పరీక్షలకు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా పరీక్ష రాసి మంచి ఫలితాలు సాధించాలని ఎస్సై వెంకట నరసింహులు కోరారు. గురువారం కళాశాలలో విద్యార్థులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎస్‌ఐ మాట్లాడుతూ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో రాసేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

➡️