నేటి నుండి మున్సిపల్‌ సమ్మె

ప్రజాశక్తి-గుంటూరు : మున్సిపల్‌ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని ఎపి మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో నేటి నుండి సమ్మెలోకి వెళ్లనున్నారు. సమస్యలపై ఈనెల 14న ఉన్నతాధికారులతో జరిగిన చర్చల్లో డిమాండ్లపై ప్రభుత్వ నుండి సానుకూలత లేకపోవటంతో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపడుతున్నట్లు నాయకులు స్పష్టం చేసిన విషయం విదితమే. దీనిలో భాగంగా గుంటూరు జిల్లాలోనూ మంగళగిరి-తాడేపల్లి, గుంటూరు కార్పొరేషన్లు, పొన్నూరు, తెనాలి మున్సిపాల్టీల్లో సమ్మె జరుగుతుందని యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ముత్యాలరావు తెలిపారు.జిల్లాలోని రెండు మున్సిపాల్టీలు, రెండు కార్పొరేషన్లలో పనిచేస్తున్న పారిశుధ్యం, ఇంజినీరింగ్‌, వాటర్‌ వర్క్స్‌, స్ట్రీట్‌లైట్స్‌ విభాగాలలో పనిచేస్తున్న కార్మికులు, చెత్త ట్రాక్టర్లు ట్రాక్టర్స్‌ డ్రైవర్లు తదితర రంగాల కార్మికులు సుమారు 6వేల మంది పనిచేస్తున్నారు. వీరాంతా దాదాపుగా సమ్మెలో ఉంటారని నాయకులు తెలిపారు. ప్రధానంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పర్మినెంట్‌ చేయాలనే ప్రధాన డిమాడ్లతో పాటు ఇంజినీరింగ్‌ కార్మికులకు జిఒ 30ని సవరించి వేతనాలు ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో ఇచ్చిన జిఒ 30లో తప్పులు దొర్లటం వల్ల కొందరు స్కిల్డ్‌ వర్కర్లు కూడా అన్‌స్కిల్డ్‌ వేతనాలు తీసుకోవాల్సి ఉంది.ప్రస్తుతం పారిశుధ్య కార్మికులకు రూ.15వేల వేతనం, రూ.6వేలు హెల్త్‌ అలవెన్స్‌ ఇస్తున్నారు. హెల్త్‌ అలవెన్స్‌ ప్రతి నెలా సకాలంలో విడుదల చేయట్లేదు. రెండు, మూడు నెలలకోసారి మాత్రమే ఇస్తున్నారు. పర్మినెంట్‌ కార్మికులకు ఇస్తున్న విధంగా బేసిక్‌తోపాటు, డిఎ కలిపి ఇవ్వాలని కోరుతున్నారు. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజి వర్కర్లు, చెత్త తరలించే వాహనాల డ్రైవర్లు, మలేరియా వర్కర్లు, పార్కు వర్కర్లకు కూడా పారిశుధ్య కార్మికుల మాదిరిగా హెల్త్‌ అలవెన్స్‌, ఇంజినీరింగ్‌ కార్మికులకు రిస్క్‌ అలవెన్స్‌ ఇవ్వాలనే డిమాండ్‌ ఉంది. క్లాప్‌ ఆటో డ్రైవర్లకు రూ.18 వేలు జీతం ఇవ్వాలని, విలీన గ్రామ పంచాయతీల్లోని కార్మికులకు కూడా మున్సిపల్‌ వర్కర్లకు ఇస్తున్న జీతాలు ఇవ్వాలని అడుగుతున్నారు. మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో విలీనం అయిన గ్రామాల్లోని పారిశుధ్య కార్మికులకు మున్సిపల్‌ వర్కర్లకు ఇస్తున్న జీతాలుగానీ, హెల్త్‌ అలవెన్స్‌గానీ ఇవ్వట్లేదు. ఇటీవల జరిగిన ప్రన్సిపల్‌ సెక్రెటరీతో జరిగిన చర్చల్లో అండర్‌గ్రౌండ్‌, మలేరియా, పార్క్‌ వర్కర్లకు, చెత్త డ్రైవర్లకు రూ.6 వేలు హెల్త్‌ అలవెన్స్‌ ఇస్తామని ప్రిన్సిపాల్‌ సెక్రెటరీ హామీ ఇచ్చారు. అయితే జిఒ ఇంకా విడుదల కాలేదు. శాశ్వత స్వభావం కలిగిన పనిలో పనిచేస్తున్నందన మున్సిపల్‌ వర్కర్లను పర్మినెంట్‌ చేయాలని, ఈ లోగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఇతర డిమాండ్లపై ప్రభుత్వ నుండి సానుకూలత లేదు. దీంతో సమ్మెలోకి వెళుతున్నట్లు నాయకులు ప్రకటించారు.ప్రభుత్వం నాయకులతో చర్చలు జరిపి సమ్మెను నివారించాలని ముత్యాలరావు కోరారు. సమ్మెలో భాగంగా సోమవారం రాత్రి సమ్మెకు సంబంధించిన కరపత్రాలను మంగళగిరిలోని సిఐటియు కార్యాలయంలో ఆవిష్కరించారు. సమ్మెలో మంగళగిరి తాడేపల్లి నగరపాల సంస్థ పరిధిలో పనిచేసే కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు ఎస్‌ఎస్‌ చెంగయ్య పిలుపునిచ్చారు. సీనియర్‌ నాయకులు జెవి రాఘవులు, టి.శ్రీరాములు, మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు మంగయ్య, పి.పూర్ణ, కె.నాగేశ్వరమ్మ పాల్గొన్నారు. తాడేపల్లిలోని పలు మస్టర్‌ పాయింట్ల వద్ద యూనియన్‌ నాయకులు వి.దుర్గారావు, కె.కరుణాకరరావు సమావేశాలు నిర్వహించారు. సమ్మె జయప్రదంపై కార్మికులతో మాట్లాడారు.

➡️