పంచాయతీల నిధుల మళ్లింపుపై ప్రచారం

Dec 2,2023 21:22

 ప్రజాశక్తి- గంట్యాడ  :  పంచాయతీలకు కేటాయించిన నిధులను సర్పంచులకు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం మళ్లించి మోసం చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నామని పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర కార్యదర్శి గేదెల రాజారావు అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో శనివారం నియోజకవర్గం స్థామి సర్పంచులు, మాజీ సర్పంచులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నాలుగున్నరేళ్ల కాలంలో వైసిపి ప్రభుత్వం కేంద్రం నుంచి పంచాయతీలకు వచ్చిన రూ. 8,629 కోట్లను మళ్లించి తన సొంత అవసరాలకు వాడుకుందన్నారు. చెక్కుల మీద సర్పంచుల సంతకాలు లేకుండా సర్పంచులకు కనీసం సమాచారం ఇవ్వకుండా సిఎఫ్‌ఎంఎస్‌ ఖాతాల నుంచి నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిందని ఆరోపించారు. పంచాయతీ నిధులు మళ్లింపుపై ప్రస్తుత, మాజీ సర్పంచులంతా గ్రామ వికాసం పేరిట గ్రామాల్లో ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. పార్టీలకు అతీతంగా సర్పంచులంతా పాల్గొని నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 10న శ్రీకాకుళం, 11 కాకినాడ, 14 నరసారావుపేటలో సమావేశాలు నిర్వహిస్తామని ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారని స్పష్టం చేశారు. ప్రభుత్వం సర్పంచులకు చేస్తున్న ద్రోహంపై పోరాటానికి ప్రస్తుత, మాజీ సర్పంచులంతా సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు రౌతు స్వామినాయుడు, మాజీ జెడ్‌పిటిసి బండారు బాలాజీ, మాజీ సర్పంచులు బాస్కరనాయుడు, అల్లు విజయ, నియోజకవర్గం సర్పంచుల సంఘం ఇంచార్జి సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

➡️