పండక్కీ పప్పన్నం కరువేనా?

Dec 27,2023 21:45

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :   పేద, మధ్య తరగతి ప్రజలు సంక్రాంతి పండక్కి కూడా పప్పు అన్నం తినే పరిస్థితి కనిపించడం లేదు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఈఏడాది ఏప్రిల్‌ నుంచి 17శాతం నుంచి 20శాతానికి మించి కందిపప్పు ఇవ్వని పరిస్థితి అందరికీ తెలిసిందే. కనీసం సంక్రాంతికైనా కందిపప్పు అందకపోతుందా? అని ఎదురు చూస్తున్నవారికి నిరాశ తప్పేట్టు లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్‌ కార్డుదారులకు ప్రతి నెలా సుమారు 14,500 మెట్రిక్‌ టన్నుల కందిపప్పు పంపిణీ చేయాల్సివుంది. చాలా రాష్ట్రాల్లో 5 నుంచి 12 రకాల నిత్యవసర సరుకులు అందజేస్తున్నప్పటికీ మన రాష్ట్రంలో బియ్యం, పంచదార, గోదుమ పిండి, కందిపప్పు మాత్రమే సరఫరా జరుగుతోంది. ఇందులోనూ కందిపప్పు సరిపడినంతగా కేటాయించడం లేదు. ఫలితంగా దాదాపు 80శాతం మంది కందిపప్పునకు నోచుకోవడం లేదు. వాస్తవానికి సరుకులన్నీ ప్రతి నెలా 1వ తేదీ నుంచి 17లోపు అందజేయాల్సివుంది. ఈలెక్కన ఈపాటికే జిల్లా పౌరసరఫరాల గిడ్డంగులకు చేరాల్సివుంది. నెలాఖరులోపు ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు, అక్కడి నుంచి గ్రామ, వార్డు స్థాయిల్లో ఉన్న చౌకధరల దుకాణాలకు చేరాల్సివుంది. ఇలా సమయానుకూలంగా సరుకులు రేషన్‌ డీలర్లకు చేరితే తప్ప, 1వ తేదీ నుంచి మొబైల్‌ డిస్పెనరీ యూనిట్లు (ఎండిసి)ల ద్వారా సరుకుల పంపిణీ సాధ్యం కాదు. ఈలెక్కన బియ్యం, పంచదార, గోదుమపిండి పూర్తిస్థాయిలో జిల్లాలకు చేరినప్పటికీ, కంది పప్పు మాత్రం సగమే చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 14,500 మెట్రిక్‌ టన్నులు సరఫరా కావాల్సివుండగా, ఇప్పటి వరకు కేవలం 8వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే జిల్లాలకు చేరింది. ఇందులోనూ ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు చేరింది కేవలం 3,428 మెట్రిక్‌ టన్నులే. విజయనగరం జిల్లాలో 5లక్షల 81వేల రేషన్‌ కార్డులు ఉన్నాయి. వీరందరికీ ఒకొక్క కేజీ చొప్పున 5.81 మెట్రిక్‌ టన్నుల కందిపప్పు అందజేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 2.75 మెట్రిక్‌ టన్నులు మాత్రమే జిల్లాకు చేరింది. మరోవైపు కందిపప్పు కేజీ ధర మార్కెట్‌లో రూ.200 పలుకుతోంది. ఇంతసొమ్ము పెట్టి సామాన్యులు కొనుక్కునే పరిస్థితి లేదు. ఈనేపథ్యంలో సంక్రాంతిలోనూ పప్పు అన్నం తినే పరిస్థితి లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఔను..! ఏప్రిల్‌ నుంచి కందిపప్పు కొరతే ఔను..! ఏప్రిల్‌ నుంచి కందిపప్పు కొరత ఉంది. మన జిల్లాలో ప్రతి నెలా 17శాతం 20శాతం మందికి మాత్రమే కంది పప్పు అందజేశాం. కొరత ఉండడం వల్ల ప్రభుత్వం నుంచి సరిపడినంతగా రావడం లేదు. వచ్చినంత వరకు పంపిణీ చేస్తున్నాం. సంక్రాంతి పండగ నేపథ్యంలో అందరికీ కందిపప్పు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు ఉన్నతాధికారుల నుంచి సమాచారం వచ్చింది. జిల్లాకు 5.81 మెట్రిక్‌ టన్నుల రావాల్సి వుండగా ఇప్పటి వరకు 2.75 మెట్రిక్‌ టన్నులు జిల్లాకు చేరింది. 1వ తేదీ నుంచి పంపిణీ చేపట్టాల్సివుంది. కె.మధుసూదనరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి

➡️