పండగ పూట కాలువ కంపే..!

Mar 13,2024 20:45

ప్రజాశక్తి – జామి:  – ఈ ఫొటోలో కనిపిస్తోంది మురుగు కాలువనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఇది జామి మండల కేంద్రం మధ్య గుండా ప్రవహించే సాగునీటి కాలువ. దీన్ని జాగారం – అన్నంరాజపేట కాలువుగా పిలుస్తారు. గొస్తనీ నదిపై నిర్మించిన ఈ కాలువ జాగారం ఆనకట్ట వద్ద ప్రారంభమై జామి మేజరు పంచాయతీ గుండా ప్రవహిస్తోంది. కానీ జామి మేజరు పంచాయతీ చెత్తతో సాగునీటి కాలువ కాస్త మురుగు కాలువగా మారిపోయింది. ఇదే జామి గ్రామంలో అపారిశుధ్యం తాండవించేలా చేస్తోంది. కాగా ఈ నెల 16 నుంచి మూడు రోజులు పాటు ఎల్లారమ్మ జాతర ఉన్న నేపథ్యంలో పండుగ పూట కూడా దుర్వాసనలు వెదజల్లుతున్న పరిస్థితి నెలకొందని మండల కేంద్ర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు, అధికారులు చోద్యం చూస్తున్నారు తప్పా..నివారణ చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా గ్రామ ప్రజలు నిత్యం దుర్వాషనల మద్య తిరుగుతున్న దుర్భర పరిస్థితులు ఉన్నాయని వాపోతున్నారు.మండలంలో జాగారం – అన్నంరాజుపేట సాగు నీటి కాలువ 5 కిలోమీట్లర్లు మేర ప్రవహిస్తోంది. అందులో సగబాగం జామి మేజరు పంచాయతీలోనే ప్రవహిస్తోంది. వాస్తవానికి సాగునీటి కాలువలో ఎటువంటి వ్యర్ధాలు, మలినాలూ కలవకూడదు. కానీ యథేచ్ఛగా పంచాయతీలోని వ్యర్ధాలు కాలువలో కలిపేస్తున్నారు. ఫలితంగా జెఎ ఛానల్‌ మురుగు కూపంలా మారిపోయి, ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని జామి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పంచాయతీ, మండల స్థాయి అధికారులు చోధ్యం చూస్తున్నారే తప్ప నివారణ చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోనీ పాలక వర్గమైనా పట్టించుకుంటుందా అంటే అదీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జామి మేజరు పంచాయతీలో 12,732 మంది జనాభా నివసిస్తున్నారు. ఈ గ్రామం గుండా సుమారుగా మూడు కిలో మీటర్ల మేర జెఎ ఛానల్‌ కాలువ ప్రవహిస్తోంది. స్వచ్ఛమైన సాగునీటితో ప్రవహించే కాలువ సైతం నేడు కలుషితమైన మురుగు కాలువగా మారి నిత్యం దుర్వాసన వెదజల్లుతోంది. ఇది కూడా మండల పరిషత్తు కార్యాలయానికి ఆనుకుని ఉండటం, అక్కడకు రోజుకి సిబ్బందితో పాటు ఇతర ప్రజలు వందలాది మందిగా వస్తుండటం, వీరంతా ఈ దుర్వాసనతో ఇబ్బందులు పడటమే కాకుండా అనారోగ్యానికి గురవుతుండటం నిత్య కృత్యంగా మారింది.చికెన్‌ దుకాణాల్లో మిగిలిన వ్యర్థాలూ కాలువలోనేఈ కాలువలో గ్రామానికి చెందిన చెత్తతో పాటు చికెన్‌ దుకాణాల్లో మిగిలిన వ్యర్ధాలను, చనిపోయిన కోళ్లను సైతం పడేయడం వల్ల కాలువ మొత్తం కలుషితమై దుర్వాసన వస్తోంది. ఒక్క చికెన్‌ దుకాణాలు మాత్రమే కాదు…చేపలు, మటన్‌ షాపుల్లో మిగిలిన వ్యర్థాలు, కళ్యాణ మండపంలోనీ మిగులు వ్యర్థాలకు కాలువ భాగమే కేంద్ర బిందువు. ఈ నేపథ్యంలోనే గ్రామ ప్రజలు జ్వరాలు బారిన పడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా నెయ్యిల వీధి, పడాల వీధి, మంగల వీధి, బిసి కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం దోమలు, విష కీటకాల బారిన పడి అనారోగ్యాలకు గురవుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కాలువలో పేరుకుపోయిన మురుగు, చెత్తను తొలగించాలని కోరుతున్నారు.కాలువలో వ్యర్ధాలు వేయకూడదుసాగునీటి కాలువలో వ్యర్ధాలు వేయకూడదు. జాగారం- అన్నంరాజపేట కాలువ సగభాగం జామి మేజరు పంచాయతీ గుండా ప్రవహిస్తోంది. కాలువలో పంచాయతీ వ్యర్థాలు అధికంగా కనిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే అనేక దఫాలు దుకాణాధారులను హెచ్చరించాం. పంచాయతీ దృష్టికి తీసుకెళ్లాం. మరోసారి చర్యలకు ఎంపిడిఒ, పంచాయతీ ఇఒ దృష్టికి తీసుకెళ్లి, కాలువ కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటాం.- మూర్తి, ఇరిగేషన్‌ జేయి, జామి మండలం

➡️