పకడ్బందీగా పంట నష్టాల గణన : కలెక్టర్‌

ప్రజాశక్తి-రాయచోటి మిచౌంగ్‌ తుపాను వల్ల దెబ్బతిన్న పంట నష్టాల గణనను పకడ్బందీగా చేయాలని వ్యవసాయ, ఉద్యానవన అధికారులను కలెక్టర్‌ గిరీష ఆదేశించారు. ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం కలెక్టర్‌ గిరీష మాట్లాడుతూ రైల్వేకోడూరు డివిజన్‌లో అరటి తోటలకు సంబంధించి నష్ట వివరాలను త్వరగా లెక్కించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నీటిపారుదలకు శాఖకు సంబంధించి పెద్దగా నష్టం జరగలేదని సంబంధిత అధికారులు కలెక్టర్‌కు వివరించారు. జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. జిల్లాలో దాదాపు 7 రహదారులు కొద్దిగా దెబ్బతిన్నాయని ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ కలెక్టర్‌కు వివరించగా వాటిని త్వరితగతిన పునరుద్ధరించాలని ఆదేశించారు. పంచాయతీ రాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖ, పశుసంవర్ధక శాఖల అధికారులకు తగు సూచనలు చేశారు. జిల్లాలో మొత్తం 19 మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు చేసినట్లుగా ఆరోగ్యశాఖ అధికారులు వివరించగా, అంటువ్యాధులను అరికట్టేందుకు సరైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకు ముందు తుపాను ప్రభావిత గ్రామాలన్నింటినీ పూర్వస్థితికి పునరుద్ధరించాలిని, బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. మిగ్జామ్‌ తుఫాను ప్రభావంపై అన్నమయ్య, నెల్లూరు, బాపట్ల, తదితర జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్‌ గిరీష, ఎస్‌పి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తుపాను బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించడం అనేది అన్నిటికంటే ముఖ్యమైనదని పేర్కొన్నారు. తుపాను బాధితులు కలెక్టర్లు మమ్మల్ని బాగా చూసుకున్నారు అని చెప్పగలిగినప్పుడే కలెక్టర్లు వారి బాధ్యతను పూర్తిగా నిర్వర్తించినట్లు అవుతుందన్నారు. వ్యవసాయ భూములు నీటితో నిండి ఉన్నందున ఆ నీటిని తీసివేసి ఆ వ్యవసాయ భూములను పునరుద్ధరించాలని ఆదేశించారు. రైతులకు కలెక్టర్లు పూర్తి భరోసా ఇవ్వాలని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలపాలన్నారు. ప్రతి గ్రామంలో విద్యుత్తును పునరుద్ధరించాలని, రహదారులు ఏమైనా పాడైపోతే వాటిని పునరుద్ధరించాలని ఆదేశించారు. తుపాను వల్ల పాక్షికంగా గాని పూర్తిగా గాని కూలిపోయిన ఇళ్లను పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అంటు వ్యాధులను అరికట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, డిఆర్‌ఒ సత్యనారాయణ, ఎస్‌డిసి శ్రీలేఖ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️