పటిష్టంగా అట్రాసిటీ చట్టం అమలు

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కమిటీ సభ్యులకు పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌, ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి సూచించారు. జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మొనిటిరింగ్‌ కమిటి సమావేశం నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించారు. కలెక్టర్‌, ఎస్పీ మాట్లాడుతూ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా అవసరమైన పరిస్థితులో ఈ చట్టాన్ని వర్తింప జేసేలా సభ్యులు వారి పరిధిలో ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పిఒఎ చట్టానికి సంబంధించి మూడేళ్లలో జిల్లాలో ఏయే ప్రాంతాల్లో కేసులు ఎక్కువ నమోదవుతున్నాయో ఆ ప్రాంతాలను మ్యాప్‌ చేసి, అ ప్రాంత ప్రజలలో ఈ చట్టం మీద అవగాహన కల్పించాలని, సుహృద్భావ వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. ఇందుకు రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం కృషి చేయాలన్నారు. ప్రతినెలా 4వ శనివారం ఆర్‌డిఓ, డిఎస్‌పి, పోలీస్‌ స్టేషన్‌ ఆఫీసర్‌, మండల స్థాయిలో పౌర హక్కుల దినోత్సవం జరపాలని ఆదేశించారు. కమిటీ సభ్యులకు చట్టంపై అవగాహన కోసం నిష్ణాతులతో శిక్షణిప్పించాలన్నారు. కోటప్పకొండలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌లో గల షాపులను ఎస్పీలకూ కేటాయించాలని సభ్యులు కోరగా దీనిపై దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌కు నివేదికివ్వాలని ఆర్‌డిఒను కలెక్టర్‌ అదేశించారు. రెంటచింతల ప్రాంతంలోని పొలం విషయంలో జరుగుతున్న వివాదంపై మరియదాసు వివరాలు కోరగా విచారణ నివేదిక సిద్ధంగా ఉందని డీఎస్పీ చెప్పగా మరింత లోతుగా పరిశీలించి నివేదించాలని ఎస్పీ ఆదేశించారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డిడి ఓబుల నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️