పట్టాల కోసం ముట్టడి

ముట్టడిలో మాట్లాడుతున్న పాశం రామారావు
ప్రజాశక్తి – మంగళగిరి :
మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా వివిధ రకాల ప్రభుత్వ భూముల్లో ఇళ్లేసుకుని నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలను వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కొద్దిరోజులుగా రిలేదీక్షలు చేస్తున్న పేదలు, సిపిఎం నాయకులు బుధవారం మంగళగిరి – తాడేపల్లి నగరపాలక సంస్థ (ఎమ్‌టిఎంసి) కార్యాలయాన్ని ముట్టడించారు. గేటు ఎదుట బైఠాయించి అధికారుల రాకపోకలను అడ్డుకున్నారు. కార్యక్రమానికి సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్‌ చెంగయ్య అధ్యక్షత వహించారు. రామారావు మాట్లాడుతూ 30 వేల మంది ఇళ్లేసుకుని జీవిస్తుంటేవ వారిలో 10 వేల మందికే పట్టాలిచ్చారని, మరో 20 వేల మంది ఎదురు చూస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. అభ్యంతరం లేని స్థలాల్లో ఇళ్లకూ పట్టాలివ్వడం లేదని, తొలగించిన ఇళ్ల స్థానంలో ప్రత్యామ్నాయ ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాజధానికి ఇచ్చిన భూముల్లో డొంక పోరంబోకు భూములు, చెరువు భూములున్నా వాటిని తీసుకున్నారని, పేదలు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో పట్టాలివ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు చేతులు రావడం లేదని ప్రశ్నించారు. తాడేపల్లి పట్టణంలోని సుందరయ్య నగర్‌, కృష్ణనగర్‌, రామయ్య కాలనీ, పుష్కరాల సందర్భంగా రోడ్డు మార్గంలో ఉన్నవారిని తొలగించిన వారికి ప్రత్యాయంగా స్థలాలు చూపలేదని తెలిపారు. కొలనుకొండ, వడ్డేశ్వరం అసైన్డ్‌ భూములు, కొండ పోరంబోకు భూముల్లో నివాసం ఉంటున్న పేదలకు పట్టాలు ఇవ్వాలన్నారు. కుంచనపల్లి నుండి చిరావూరు వరకు పిడబ్ల్యూడి కట్టలపై నివాసముంటున్న పేదలకు, రైల్వే స్థలాల్లో ఇల్లు వేసుకుని నివాసం ఉన్నవారికి పట్టాలివ్వడం లేదన్నారు. మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువు, కొండ చుట్టూ ఉన్న ప్రాంతం, పానకాల స్వామి గుడిమెట్ల వద్ద, పావురాల కాలనీ తదితరు ప్రాంతాల్లో ఇళ్లేసుకుంటున్న వారికీ పట్టాలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఇదేతీరు కొనసాగితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్పొరేషన్‌ పరిధిలో ప్రజలను అవస్థ పెడుతున్న డ్రెయినేజీ సమస్యనూ వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. దళితులకు శ్మశాన స్థలాల్లేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే స్థలాలు కేటాయించాలని కోరారు.
ప్రభుత్వ స్థలాలన్నీ ప్రజలవే
ప్రభుత్వ స్థలాలన్నీ ప్రజలవే అని, పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సూర్యారావు అన్నారు. కార్పొరేట్లకు ఏ భూమినైనా క్షణాల్లో రాసిస్తే రాసిస్తున్నారని, ఆడవులనూ కట్టబెడుతున్నారని, అలాంటిది అభ్యంతరం లేని స్థలాల్లో ఇళ్లేసుకున్న పేదలకు పట్టాలెందుకివ్వరని ప్రశ్నించారు. రెవెన్యూ చట్ట ప్రకారం పట్టాలు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వడం లేదని విమర్శించారు. పట్టాలిచ్చే వరకూ పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.సిపిఎం ఎమ్మెల్యే ఉన్నప్పుడు పట్టాలు మంగళగిరి ఎమ్మెల్యేగా నిమ్మగడ్డ రామ్మోహన్‌రావు ఉన్న సమయంలో వివిధ గ్రామాల్లో ఇళ్లేసుకున్న వందల మందికి పట్టాలిచ్చినట్లు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.రవి గుర్తు చేశారు. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకని ప్రశ్నించారు. మంగళగిరి పట్టణంలోని గండాలయపేటలోని దేవస్థానం భూమిలో ఇళ్లేసుకున్న వారికి పట్టాలిస్తామనే ఎమ్మెల్యే హామీ నెరవేరలేదని, పట్టాలిచ్చే వరకూ పోరాడాలని సీనియర్‌ నాయకులు జెవి రాఘవులు పిలుపునిచ్చారు. పేదలకు ప్రభుత్వం స్థలాల్విని నేపథ్యంలో కమ్యూనిస్టులు పోరాటం ద్వారా పేదలు ఇళ్లేసుకున్నారని, స్థలమిచ్చి ఇళ్లు కట్టించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం కనీసం పట్టాలైనా ఇవ్వడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇ.అప్పారావు మండిపడ్డారు. 50 ఏళ్ల క్రితమే ఆత్మకూరులో కొన్ని ప్రాంతాల్లో డికె పట్టాలిచ్చారని, ఆ విధంగా ఇచ్చినా ఇబ్బంది ఉండదని సీనియర్‌ నాయకులు ఎం.పకీరయ్య అన్నారు. పేదలను పాలకులు చులకనగా చూస్తున్నారని, హామీలిస్తున్నారేగాని అమలు చేయడం లేదని సిపిఎం తాడేపల్లి పట్టణ, రూరల్‌ కార్యదర్శులు బి.వెంకటేశ్వర్లు, డి.వెంకటరెడ్డి విమర్శించారు. పేదలకు పట్టాలంటే అభ్యంతరం పెడుతున్న ప్రభుత్వం సీతానగరం కొండపైన స్వామీజీకి ఎలా ఇచ్చారని నిలదీశారు.
మురుగు నీరు ఎత్తిపోసుకోవడానికి నెలకు రూ.2 వేల ఖర్చు
ఇదిలా ఉండగా తాడేపల్లిలోని సుందరయ్య నగర్‌లో డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని ఆ ప్రాంత ప్రజలు సిపిఎం నాయకులు ఉష ఆధ్వర్యంలో కమిషనర్‌ వి.నిర్మల కుమార్‌కు విన్నవించారు. డ్రెయినేజీ వ్యవస్థ లేని కారణంగా మురుగు నీటిని గుంతల్లో నిల్వ చేసుకోవాల్సి వస్తోందని, వాటిని ప్రతినెలా రూ.2 వేలు వెచ్చించి ఎత్తి పోసుకోవాల్సిన దుస్థితి నెలకొందని వివరించారు.
కమిషనర్‌కు వినతి
సమస్యలపై కమిషనర్‌ వి.నిర్మలకుమార్‌కు నాయకులు వినతిపత్రం ఇచ్చారు. ఆయన స్పందిస్తూ రెవెన్యూ సంబంధించిన ఇళ్ల స్థలాల సమస్యను తహశీల్దార్‌, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పారు. డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామని హామీని ఇచ్చారు. దీంతో ఆందోళన ముగిసింది. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి వై.కమలాకర్‌, సీనియర్‌ నాయకులు పి.బాలకృష్ణ, నాయకులు డి.శ్రీనివాస్‌ కుమారి, వి.వెంకటేశ్వరరావు, కె.కరుణాకరరావు, జె.శివభావన్నారాయణ, టి.శ్రీరాములు, ఎం.బాలాజీ, యు.దుర్గారావు, సిహెచ్‌ సీతారామాంజనేయులు, కె.వెంకటేశ్వరరావు, కె.ప్రకాష్‌రావు, పి.కృష్ణ, ఎస్‌.కె ఎర్రపీరు, వీర్లంకయ్య, ఇ.కాటమరాజు పాల్గొన్నారు.

➡️