పడకేసిన ప్రాజెక్టుల ఆధునీకరణ పనులు

Jan 16,2024 22:25

ప్రజాశక్తి-బొబ్బిలి : ఉమ్మడి విజయనగరం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణ పనులు పడకేశాయి. సాగునీటి ప్రాజెక్టులను ఆధునీకరణ చేసి రైతులకు సంపూర్ణంగా సాగునీరు ఇచ్చేందుకు జైకా నిధులు మంజూరై ఐదేళ్లు గడిచినా ఆధునీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం బిల్లుల చెల్లింపులో జాప్యం చేయడంతో ఆధునీకరణ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణ పనులు నత్తనడకన సాగడంతో రైతులకు సకాలంలో సాగునీరు అందడం లేదు. సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం నియోజకవర్గ పరిధిలో ఉన్న సాలూరు, మక్కువ, బొబ్బిలి, సీతానగరం మండలాల రైతులకు సాగునీరు అందించే వెంగళరాయ సాగర్‌ ప్రాజెక్టు ఆధునీకరణకు జైకా నిధులు రూ.48.89కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు రూ.10కోట్లు విలువ చేసే పనులను మాత్రమే కాంట్రాక్టర్‌ పూర్తి చేశారు. కాంట్రాక్టర్‌ కు ప్రభుత్వం రూ.3.76కోట్లు బిల్లులు చెల్లించగా ఇంకా రూ.6.27కోట్లు చెల్లించాల్సి ఉంది. బిల్లులు చెల్లించకపోవడంతో పనులను కాంట్రాక్టర్‌ నిలిపివేసి టెండర్‌ను రద్దు చేయాలని ఇరిగేషన్‌ అధికారులను కోరినట్లు సమాచారం. విఆర్‌ఎస్‌ ఆధునీకరణ పూర్తి కాకపోవడంతో రైతులకు సక్రమంగా సాగునీరు అందడం లేదు. బొబ్బిలి మండలం శివారుగా ఉండడంతో నీరు అందే పరిస్థితి లేక రైతులు వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురిస్తుంది. సీతానగరం మండలంలో ఉన్న పెద్ద అంకలాం ఆనకట్ట ఆధునీకరణకు రూ.14కోట్లు మంజూరవ్వగా రూ. కోటి 5లక్షల విలువైన పనులు చేశారు. ఇప్పటి వరకు కాంట్రాక్టర్‌ కు రూ.65లక్షలు బిల్లులు చెల్లించగా ఇంకా రూ.49లక్షలు చెల్లించాల్సి ఉంది. వీటి పనులను కూడా చేయలేమని, టెండర్‌ రద్దు చేయాలని కాంట్రాక్టర్‌ కోరుతున్నట్లు తెలిసింది. వట్టిగెడ్డ ఆధునీకరణకు రూ.39.24కోట్లు మంజూరవ్వగా ఇప్పటి వరకు రూ.3.90 కోట్లు పనులు పూర్తి చేశారు. ఇప్పటి వరకు కాంట్రాక్టర్‌కు రూ.2.60 కోట్లు బిల్లులు చెల్లించగా ఇంకా రూ.1.30 కోట్లు బకాయి ఉంది. పెద్దగెడ్డ ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.23.83కోట్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు రూ.6.20 కోట్లు పనులు పూర్తి చేశారు. కాంట్రాక్టర్‌ కు రూ.4.80 కోట్లు బిల్లులు చెల్లించగా ఇంకా రూ.1.40కోట్లు చెల్లించాల్సి ఉంది. టెండర్‌ ను రద్దు చేయాలని కాంట్రాక్టర్‌ కోరుతున్నట్లు తెలిసింది.రైతులకు సక్రమంగా అందని సాగునీరుసాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణ పనులు జరగకపోవడంతో రైతులకు సక్రమంగా సాగునీరు అందడం లేదు. దీంతో పంటలు సక్రమంగా పండడం లేదని రైతులు వాపోతున్నారు. జైకా నిధులతో షెటర్ల మరమ్మతులు, సాగునీటి కాలువలలో పూడికలు తొలగించాల్సి ఉన్నప్పటికీ జరగలేదు. దీంతో షెటర్లు పాడైపోయి నీరు వృథాగా పోతుంది. కాలువలలో పూడికలు పేరుకుపోవడంతో రైతులకు సక్రమంగా సాగునీరు అందే పరిస్థితి లేదు. వర్షాలు అనుకూలించకపోతే పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జైకా నిధులతో సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణ పనులు పూర్తి చేసి పంటలకు సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.

➡️