పద్మవ్యూహమే

కడప నగరం పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. కడప కార్పొరేషన్‌ కడప అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కడా) నగరంలోని సర్కిళ్ల ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టింది. వ్యూహాత్మక ధోరణిలో దశల వారీగా పనుల్ని చేపట్టకపోవడంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జిల్లా పర్యటన ఖరారైన నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది జిల్లా కేంద్రానికి రావడంతో ట్రాఫిక్‌ సమస్య రెట్టింపైంది. ప్రజాశక్తి – కడప ప్రతినిధి కడప ట్రాఫిక్‌ సమస్యతో స్తంభించిపోతోంది. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది కడపకు రాకపోకలు సాగి స్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో నగరంలో ట్రాఫిక్‌ మోస్తరుగా ఉంటోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో కడప కార్పొరేషన్‌ కోట్లాది రూపాయల వ్యయంతో నగరంలోని పలు సర్కిళ్లను ఆధునీకరిస్తోంది. కోటిరెడ్డి, అంబేద్కర్‌, వైజంక్షన్‌, ఏడురోడ్లు, గోకుల్‌లాడ్జి, అన్నమయ్య, మాసాపేట వంటి కీలక సర్కిళ్ల ఆధునికీకరణ పనుల్ని వేగవంతం చేసింది. సర్కిళ్లను అభివృద్ధి చేయడం ఆహ్వానించదగినదే. ఎంపిక చేసుకున్న సమయం, వ్యూహాత్మక ధోరణి కొరవడిన ఫలితంగా ప్రజానీకాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.ట్రాఫిక్‌ మళ్లింపుతో సతమతం కోటిరెడ్డి సర్కిల్‌ ఆధునీకరణ నేపథ్యంలో ట్రాఫిక్‌ను మళ్లించడం అనివార్యంగా మారింది. సంధ్యా సర్కిల్‌ నుంచి జిల్లా పరిషత్‌ మీదుగా మళ్లించడంతో జిల్లా పరిషత్‌ నుంచి పాతబస్టాండు వరకు రద్దీగా మారింది. ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది. సెవెన్‌ రోడ్స్‌ సర్కిల్‌ నుంచి మిగిలిన సర్కిళ్లన్నింటిలో ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది. బస్సులు మొదులకుని ద్విచక్ర వాహనాలతో రహదారి రద్దీగా మారింది. పాలు, నిత్యావసర వాహనాలు, ఇతర సామాగ్రితో కూడిన భారీ వాహనాలొస్తే ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది. ఫలితంగా జిల్లాలోని వందలాది ఆస్పత్రులకు వెళ్లాల్సిన రోగులు, వందలాది విద్యాసంస్థలకు వెళ్లాల్సిన విద్యార్థులు, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలకు వెళ్లాల్సిన రోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.కొరవడిన ముందుచూపు నగరంలోని సర్కిళ్ల ఆధునికీకరణ పనులు చేపట్టడానికి ముందు అవసరమైన కసరత్తు కొరవడింది. పనులకు ముందు పత్రికల్లో బుగ్గవంక రహదారులపై కథనాలు సైతం రావడం గమనార్హం. అప్పటికైనా కార్పొరేషన్‌ పాలనా యంత్రాంగం స్పందించి ఉంటే బాగుండేది. బుగ్గవంక రక్షణకు గోడకు ఇరువైపులా రహదారి పనుల్ని పూర్తి చేయించి పనులు చేపట్టాల్సి ఉండేది. అటువంటి ముందుచూపు కొరవడిన ఫలితంగా ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది రావడంతో ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌, సంద్యా సర్కిళ్లలో ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది.ఆర్‌అండ్‌బి దగ్గర గందరగోళంకడప ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌ దగ్గర ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది. ఒక్కోసారి 20 నిమిషాల వరకు వాహనాలు ఆగిపోతున్నాయి. గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరణకు పోలీసులు లేకపోవడంతో నాలుగు వైపులా రహదారుల నుంచి వచ్చే వాహనాలతో స్తంభించిపోయింది. ఫలితంగా నాగరాజుపేట ప్రాంతంలోని చిన్నచిన్న సందులు, గొందుల గుండా ద్విచక్ర వాహనాలతో కిక్కిరిసిపోవడం కనిపించింది. మధ్యాహ్నం జిజిహెచ్‌కు వెళ్లే రహదారిని పోలీసులు స్తంభింపజేశారు. ఆస్పత్రికి వెళ్లే రోగులు, ఇంటికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికావడం ఆందోళన కలిగించింది.

➡️