పనికి తగ్గ వేతనం ఇవ్వాలి

ప్రజాశక్తి – కడప అర్బన్‌ :

ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు అనుబంధం) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్‌ కార్మికులు సమ్మె బాట పట్టారు. మంగళవారం ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో పాతమున్సిపల్‌ కార్యాలయం, కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట సమ్మె చేపట్టారు. ఈ సమ్మెకు టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యులు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, జనసేన జిల్లా ఇన్‌ఛార్జీ శ్రీనివాస్‌, యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదన విజరుకుమార్‌, పాలెం మహేష్‌బాబు, నాయకులు సంపూర్ణమద్దతు ప్రకటించారు. ఈ వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కార్మికులు కోరుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికముందు హామీ ఇచ్చి తరవాత తుంగలోతొక్కడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే సమస్యలను పరిష్కరిస్తామని, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని కోరుతామన్నారు. సమ్మెకు యుటిఎఫ్‌ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు. హామీ ఇచ్చిన అన్ని వర్గాలను సిఎం మోసం చేశారని విమర్శించారు. సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య, ఫెడరేషన్‌ నగర అధ్యక్షులు సుంకర రవి మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల రెగ్యులర్‌ కోసం మున్సిపల్‌ కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారని పేర్కొన్నారు. ఇంజినీరింగ్‌ కార్మికులకు హెల్త్‌ రిస్క్‌ అలవెన్స్‌ ఇవ్వాలని చెప్పారు. క్లాప్‌ ఆటోల డ్రైవర్లకు రూ.18,500 కనీస వేతనం ఇవ్వాలని తెలిపారు. మున్సిపల్‌ ఆప్కాస్‌ ఉద్యోగులు, కార్మికులకు రిటైర్డ్‌ మెంట్‌ బెనిఫిట్స్‌, గ్రాట్యూటీ, సగం జీతం పెన్షన్‌గా ఇవ్వాలని కోరారు. విలీన పంచాయతీలు, కరోనా, వరదలు, కొత్తగా తీసుకున్న కార్మికులకు ఆప్కాస్‌ జీతాలు, హెల్త్‌ అలవెన్సు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్‌, ఫెడరేషన్‌, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మైదుకూరు : మున్సిపల్‌ ఆప్కాస్‌ కార్మికులను వెంటనే పర్మినెంట్‌ చేయాలంటూ మున్సిపల్‌ కార్మికులు డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ ఉద్యోగులకు, కార్మికులకు జగనన్న ఇచ్చిన హామీల సాధనకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా మంగళవారం మైదుకూరు పాత మున్సిపాలిటీ కార్యాలయం ముందు పారిశుధ్య కార్మికులు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సిఐటియు ట్రెజర్‌ జి.చిన్న, లక్ష్మయ్య, శేఖర్‌, వెంకటసుబ్బయ్య, పుల్లమ్మ, విశ్వనాథం, చిన్న రాముడు, నాగయ్య, పాపారాయుడు, ఓబులమ్మ పాల్గొన్నారు. బద్వేలు : స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద బద్వేల్‌ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర నాయకులు కాలువ నాగేంద్రబాబు మాట్లాడుతూ సమ్మెతోనైనా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ పట్టణ ఉపాధ్యక్షులు షేక్‌ ఆదిల్‌, యూనియన్‌ పట్టణ అధ్యక్షులు పులి శ్యామ్‌ప్రవీణ్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు దియ్యాల హరి, ఉపాధ్యక్షులు గంటా శ్రీనివాసులు, దియ్యాల దేవమ్మ, ప్రధాన కార్యదర్శి దియ్యాల నాగేంద్రబాబు, కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు : కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మునిసిపల్‌ కార్మిక సంఘ (సిఐటియు అనుబంధం) గౌరవ అధ్యక్షులు సత్యనా రాయణ కార్యదర్శి సాల్మన్‌ కోరారు. రాష్ట్ర సంఘం పిలుపుమేరకు మంగళవారం కార్మికులు స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు చంటి, పట్టణ కోశాధికారి రాఘవేంద్ర, ప్రమీలమ్మ, గుర్రమ్మ, గీతమ్మ, రమాదేవి, శాంతి, మరియమ్మ, నరసమ్మ, అన్నపూర్ణ, మోహన్‌, జాకోబ్‌, ఓబయ్య, సురేష్‌ పాల్గొన్నారు.

➡️