పనిభారం తగ్గించాల్సిందే

Dec 13,2023 21:39

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌  :  వెట్టిచాకిరీ చేయించుకుంటున్న ‘ఆశా’లకు పనిభారం తగ్గించి వేతనం పెంచాలని ఈ నెల 14, 15వ తేదీల్లో కలెక్టరేట్‌ ఎదుట వంటావార్పుతో నిరవధిక ధర్నాకు ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) పిలుపునిచ్చింది. ఈ మేరకు జిల్లాలోని ఆశావర్కర్లంతా నిరవధిక ధర్నాకు కదులుతున్నారు. ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి, ఆయా పిహెచ్‌ సి, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ అధికారులకు ఆశా వర్కర్లు వినతి పత్రాలు ఇచ్చి ధర్నాకు వెళ్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 1679 మంది ఆశా వర్కర్లు, 1500 సిహెచ్‌డబ్ల్యుఒలు పనిచేస్తున్నారు. వీరంతా రెండు రోజులపాటు చేపట్టే 36 గంటల ధర్నాలో పాల్గొననున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశాలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని యూనియన్‌ నాయకులు కోరడంతోపాటు 36 గంటల ధర్నాకు కలెక్టరేట్‌ ఎదుట ఏర్పాట్లు చేస్తున్నారు. వెట్టిచాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వం ఆశా వర్కర్లు సమస్యలు పరిష్కరించడంలో, కనీస వేతనాలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కారం కోసం జరిగే పోరాటానికి ఆశా వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఇప్పటికే యూనియన్‌ నాయకులు పిలుపునిచ్చారు. ఇవీ డిమాండ్లు కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లను ఆశా కార్యకర్తలుగా మార్చాలి. పనిభారం తగ్గించాలి. ఆన్లైన్‌, రికార్డు పని ఒకే సారి చేయించాలి. రూ.10లక్షల గ్రూప్‌ ఇన్సురెన్స్‌ సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వ సెలవులు, మెడికల్‌, మెటర్నిటీ లీవ్‌ ఇవ్వాలి. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ. 5 లక్షలు, పెన్షన్‌ రూ.10వేలు ఇవ్వాలి. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఇళ్ల స్థలం, ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. మరణించిన వారి కుటుంబంలో అర్హులైన వారికి ఆశాలుగా తీసుకోవాలి. కనీస వేతనం చెల్లించాలి. ఎన్‌ఎం, హెల్త్‌ సెక్రటరీల నియామకాలలో ఆశాలకు వెయిటేజీ ఇవ్వాలి.ఉద్యోగ భద్రత కల్పించాలిఅనేక ఏళ్లుగా ఆశా వర్కర్లు గా పని చేస్తున్న మాకు సరైన గుర్తింపు లేదు. ఉద్యోగ భద్రత కరువైంది. అన్ని రకాల పనులు మాతో చేయించుకుంటున్న ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఉద్యోగ భద్రత,కనీస వేతనాలు అమలు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుంది. ఆశా వర్కర్లు కష్టాన్ని ప్రభుత్వం గుర్తించి న్యాయం చేయాలి.- ఎం.శివాని, ఆశా వర్కర్ల యూనియన్‌ పార్వతీపురం పిపి యూనిట్‌ అధ్యక్షులుసమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమంఆశా వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని, పని భారం తగ్గించాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని గురు, శుక్రవారాల్లో కలెక్టరేట్‌ వద్ద 36 గంటల నిరవధిక ధర్నా, వంటావార్పు కార్యక్రమాలు చేస్తున్నాం. ఆశావర్కర్లకు పని భారం పెరగడం వల్ల అనేకమంది హార్ట్‌ ఎటాక్‌ వచ్చి అనారోగ్యం పాలై చనిపోతున్నారు. వీరికి గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని యూనియన్‌గా అనేకమార్లు ధర్నాలు చేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, అందుకే 36 గంటల పాటు ధర్నా చేయాలని నిర్ణయించాం. – వి.ఇందిర, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు

➡️