పెన్షన్‌ రాకుండా చేశారని ఫిర్యాదు

అచ్చంపేట: పెన్షన్‌ మంజూరు కాకుండా తన పేరును ఉద్దేశపూర్వకంగా తొలగించారంటూ చింతపల్లికి చెందిన చిర్రా మౌనిక బుధవారం ఎంపిడిఒ కె.వీర్రాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఐదేళ్లుగా కండరాల క్షీణిత అనే జెనిటిక్‌ వ్యాధితో బాధపడుతున్నానని వికలాంగుల పింఛన్‌ కోసం నవంబర్‌ 27న దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. చింతపల్లి గ్రామ సచివాలయం వాలంటీర్‌ మార్కాపూడి చిన్న యలమంద ఉద్దేశపూర్వకంగాతన దరఖాస్తును ఆలస్యంగా ఆన్‌లైన్‌ లో నమోదు చేసన తర్వాత డిజిటల్‌ అసిస్టెంట్‌ ,వెల్ఫేర్‌ అసిస్టెంట్‌కు పంపించారని, ఈ క్రమంలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ విచారణ ఆలస్యం కావడం, తన దరఖాస్తును తిరస్కరించడం జరిగిందని అన్నారు. వికలాంగుల పెన్షన్‌ పొందేందుకు తనకు అన్ని అర్హతలున్నా తన దరఖాస్తును ఎంపిడిఒ కార్యాలయం తిరస్కరిస్తూ మెసేజ్‌ అందినట్లు ఆమె వివరించారు. సిటిజెన్‌ చార్ట్‌ ప్రకారం 21 రోజులలో పెన్షన్‌ ఆమోదించడం లేదా తిరస్కరించడం జరుగుతుంది కానీ, ఉద్దేశపూర్వకంగానే తన దరఖాస్తును 36రోజులు పాటు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేశారని ఆరోపించారు. సంబంధిత వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, వాలంటీర్లపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలంటూ ఎంపిడిఒకు వినతిపత్రం అందజేసింది. డిబిర్‌సి మండల కన్వినర్‌ సందేపోగు అశోక్‌ బాధితురాలు వెంట ఉన్నారు .

➡️