పేదలకు ప్రభుత్వ భూమి పంచాలి : సిపిఎం

ప్రజాశక్తి – బద్వేలు పేదలకు ప్రభుత్వ భూమి పంచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. పట్టణంలోని పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూమిలేని పేదలకు ప్రభుత్వ భూములు పంచడమే నిజమైన దేశభక్తి అని తెలిపారు. భూమిలేని నిరుపేదలు గ్రామాల్లో కట్టు బానిసలుగా నూటికి 25 శాతం మంది జీవిస్తున్నారని వెల్లడించారు. పేదలపై పెద్దలు వాక్చాతుర్యంతో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, అభాండాలు వేస్తున్నారని ఆరోపించారు. భూమికోసం, ఇంటి స్థలం కోసం ప్రతిఘటన ఉద్యమాలతోనే ప్రజల నిజమైన సమగ్ర అభివద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. భారత రాజ్యాంగం మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌, అంబేద్కర్‌ లాంటి మహానుభావులు పేదల అనుకూల అంశాలు చేర్చి, పేదలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు సమకూర్చడానికి, ప్రభుత్వ యంత్రాంగానికి అధికారాలు ఇస్తే, పేదల పక్షాన కాకుండా, అబ్జాదారులకు కొమ్ము కాస్తోందని విమర్శించారు. నిస్వార్థపరులైన పాలకులు కనిపించడం లేదని, స్వేచ్ఛగా జరగాల్సిన ఎన్నికలు ధనస్వామ్యం అయిపోయాయని విమర్శించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి.శివకుమార్‌ మాట్లాడుతూ పేదలకు ఉచితంగా ప్రభుత్వ భూములు, ఇళ్ల స్థలాలు స్థలాలు పంచేవరకు ఉద్యమాలు ఆగవని పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని ఉన్న పేదలను సర్వే చేసి, అర్హుల లిస్టు ప్రకటించి, వారికి పట్టాలు, పక్కా బిల్డింగులు, కనీస మౌలిక సౌకర్యాలు మంజూరు చేయాలని కడప జిల్లా కలెక్టర్‌కు, బద్వేల్‌ ఆర్‌డిఒకు విజ్ఞప్తి చేశామన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.అన్వేష్‌ మాట్లాడుతూ ప్రజల ఆస్తులను కబ్జా చేస్తున్న కబ్జాకోరులపై”ల్యాండ్‌ గ్రాబింగ్‌ కేసులు’ రెవెన్యూ అధికారులు పెట్టటానికి ధైర్యం లేదని, పేదలు వేసుకున్న ప్రభుత్వ భూముల్లోని గుడిసెలను కూల్చడానికి, కాల్చడానికి, అక్రమ కేసులు బనాయించడానికి మాత్రం ధైర్యం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. ఇది అధికార యంత్రాంగం దిగజారుడుతనానికి నిదర్శనమని, ఇప్పటికైనా తామిచ్చే భూకబ్జా నేర ప్రవత్తి కలిగిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే భూకబ్జాదారుల భరతం వ్యవసాయ కార్మిక సంఘం పడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బద్వేల్‌ రూరల్‌ మండలం సిపిఎం కన్వీనర్‌ బి.వెంకటేష్‌, గోపవరం మండలం రూరల్‌ సిపిఎం కన్వీనర్‌ పి.కదిరయ్య, చేతి వత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్‌ ఈ.రమనయ్య, ఆవాజ్‌ జిల్లా అధ్యక్షులు పి.చాంద్‌ బాషా, వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

➡️