పొగాకు నాణ్యతపై దృష్టి సారించాలి

ప్రజాశక్తి-కొండపి : రైతులు పొగాకు నాణ్యత పెంపుదలపై దృష్టి సారించాలని కొండపి వేలం నిర్వహణాధికారి జి.సునీల్‌కుమార్‌ తెలిపారు. పొగాకు బోర్డు పరిదిలోని వెన్నూరు గ్రామంలో పొగాకు పంట నియంత్రణ, ఇతర ప్రత్యామ్నాయ పంటలపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జి.సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ మిచౌంగ్‌ తుపాను తర్వాత రైతులు చేపట్టాల్సిన చర్యల గురించి వివరించారు. తమ రైతులు భూమి ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి విస్తీర్ణాన్ని తగ్గించుకొని పొగాకు సాగు చేయాలన్నారు. తొలుత పొగాకు పంటలను పరిశీలించి తగిన సూచనలు చేశారు. పొగాకు పొలాల చుట్టూ ఎర పంటలైన ఆముదం, బంతి, అవరోధ పంటలైన జొన్న మరియు మొక్క జొన్న సాగు చేయడం ద్వారా చీడపీడల ఉధృతికి కొంత వరకూ అరికట్టవచ్చునని తెలిపారు. అనంతరం రైతులకు టార్పాలిన్‌ పట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ గ్రేడింగ్‌ అధికారి సాయికుమార్‌, పొగాకు కంపెనీల క్రాప్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️