పోలింగ్‌ కేంద్రాల నిర్వహణలో సమస్యలు తలెత్తకుండా చూడాలి : కలెక్టర్‌

ప్రజాశక్తి-పీలేరు పోలింగ్‌ కేంద్రాల నిర్వహణలో ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా చూడాలని కలెక్టర్‌ అభిషిక్త్‌కిషోర్‌ తెలిపారు. బుధవారం పీలేరులోని కోటపల్లి మండల పరిషత్‌ పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రా లలో ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన లేఅవుట్‌ ప్రకారం అన్ని సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలన్నారు. ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బందిలోనూ ఖాళీలు లేకుండా చూసుకోవాలని ఆర్డిఓ రంగస్వామి, తహశీల్దారు మహబూబాషలను ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ కేంద్రాల నిర్వహణపై బిఎల్‌ఒలను పలు ప్రశ్నలు అడిగి, పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల విధులలో బిఎల్‌ఒల పాత్ర చాలా ముఖ్యమైందని, పోలింగ్‌ సరళి పూర్తి అయ్యేంతవరకు వారే కీలక పాత్ర పోషిస్తారన్నారు. పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసే పాఠశాలల్లో విద్యుత్తు, తదితర సౌకర్యాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఏర్పాటు చేయబోయే బేరి కేడింగ్‌పై పోలీసు సిబ్బందిని పలు ప్రశ్నలు అడిగారు. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదన్నారు. అనంతరం ఆర్డిఓ రంగస్వామి, పీలేరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను సందర్శించి తహశీల్దారుకు, సెక్టోరల్‌ అధికారులకు, బిఎల్‌ఒలకు తగు సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో రాయచోటి ఆర్‌డిఒ రంగస్వామి, పీలేరు మండల తహశీల్దార్‌ మహబూబ్‌ బాష, సర్వేయర్లు, సెక్టోరల్‌ అధికారులు, బిఎల్‌ఒలు పాల్గొన్నారు.

➡️