ప్రభుత్వ కళాశాలలే మిన్న

Feb 8,2024 21:13

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌: ప్రైవేటు కాలేజీలు కన్నా ప్రభుత్వ కళాశాలలే మిన్న అన్న నినాదంతో స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ జె.రామారావు ఆధ్వర్యంలో అధ్యాపకులు 7 బృందాలుగా ఏర్పడి మండలంలోని గిరిజన సంక్షేమ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలకు వెళ్లి ప్రచారం చేశారు. పార్వతీపురం ప్రభుత్వ కళాశాలలో చేరాలంటూ పదో తరగతి విద్యార్థిని, విద్యార్థులకు అధ్యాపకులు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల విశిష్టతను వివరిస్తూ విశాలమైన తరగతి గదులు, నిష్ణాతులైన అధ్యాపకులచే నాణ్యమైన విద్యా బోధన, డిజిటల్‌ తరగతుల ద్వారా మేలైన విద్యా బోధన, ఆధునిక పరికరాలతో సంపూర్ణమైన లేబొరేటరీల ద్వారా ప్రయోగాల నిర్వహణ, మౌలిక సదుపాయాలతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో స్పోర్ట్స్‌లో పాల్గొనేందుకు ప్రత్యేక శిక్షణ, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతుల ద్వారా బోధన, ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులకు హాస్టల్‌ సదుపాయం, నిరంతరం సిసి కెమెరాల పర్యవేక్షణలో తరగతుల నిర్వహణ, విజ్ఞాన సముపార్జన కోసం అధునాతన సదుపాయాలతో కూడిన గ్రంథాలయం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే దూరప్రాంతాల విద్యార్థులకు ప్రభుత్వ బస్సు పాస్‌ సౌకర్యం, విద్యార్థులందరికీ అమ్మబడి వంటి పథకాల వర్తింపు, విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, బాల బాలికలకు వేర్వేరుగా విశాలమైన మరుగుదొడ్ల సదుపాయాలు ఉన్న ప్రభుత్వ కళాశాలలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు టి.రవికుమార్‌, ఎస్‌.శ్రీనివాసరావు, సుకన్య, శాంతి, ధనలక్ష్మి, తేజ, తవిటి నాయుడు, లక్ష్మణరావు, రామకృష్ణ, సత్యనా రాయణ, శర్మ, కైలాష్‌, రవికాంత్‌, వెంకటేశ్వరరావు, బాబ్జీరావ్‌ తదితరులు పాల్గొన్నారు.కురుపాం : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వచ్చే ఏడాదిలో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం కళాశాల అధ్యాపకులు గురువారం కురుపాం జిల్లా పరిషత్‌, మహాత్మ జ్యోతిబాపూలే, శివన్నపేట జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో అధ్యాపకులు మాట్లాడుతూ కళాశాల ఆవశ్యకతలు, తరగతి గదుల, గ్రూపులు, వసతి సౌకర్యాలు, ల్యాబ్‌లు అక్కడ అందిస్తున్న విద్యా విధానం గూర్చి వివరించి తప్పనిసరిగా అందరు విద్యార్థులు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు లలిత, రామమోహనరావు, మురళీకృష్ణ, రామకృష్ణ, ఎల్లంనాయుడు, నిర్మలాజ్యోతి స్వప్న, సతీష్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️