ప్రమాదంలో ప్రజారోగ్యం

ప్రజారోగ్యం

నిబంధనలు పాటించని హోటళ్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు
ఎక్కువ మోతాదులో రంగుల వాడకం
నాసిరకం నూనెలతోనే ఆహార పదార్థాలు తయారీ
లైసెన్సులు లేకుండానే యథేచ్ఛగా వ్యాపారాలు
ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి
ఉమ్మడి జిల్లాలో ఆహార పదార్థాలను విక్రయించే పలు దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. రెండుసార్లు కంటే ఎక్కువ దఫాలు ఆయిల్‌, మోతాదుకి మించి రంగులు, వివిధ రసాయనాలు వాడకంతో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నాయి. జాతీయ ఆహార భద్రత ప్రమాణాలకు విరుద్ధంగా ఆహార పదార్థాలు అమ్మకాలు, వినియోగం ఎక్కువగా జరుగుతోంది. ఆహార కల్తీ నియంత్రణ అధికారి నుంచి ఎటువంటి లైసెన్సులు లేకుండానే విచ్చలవిడిగా వ్యాపారాలు సాగిపోతున్నాయి. ఆహార పదార్ధాల్లో కల్తీలు నియంత్రించేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. ఆహార పరిరక్షణ, ప్రమాణాల చట్టం 2006ను తీసుకొచ్చి అమలు చేస్తోంది. ఇది 2012 ఆగస్టు 5 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే వంట నూనెలు, ఆహార పదార్ధాల అమ్మకాలపై ఎప్పటికప్పుడు అధికా రులు తనిఖీలు చేస్తు న్నా అమ్మకం దారులు పట్టించుకోకుండా లాభర్జనే ధ్యేయంగా వ్యాపారాలను సాగిస్తున్నారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రుచి, రంగు కోసం అనేక రసాయనాలు, పౌడర్లు వినియోగిస్తున్నారు. నిషేధిత రసాయన పదార్ధాలను తినే ఆహార పదార్థాల్లో విచ్చలవిడిగా వాడుతున్నా సంబంధిత అధికారులు అంతగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కాకినాడ జిల్లాలో హోటళ్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, ప్యాకేజ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ కేంద్రాలు, బేకరీలు, ఆయిల్‌ ఉత్పత్తి చేసే సెంటర్లు తదితర వాటిల్లో ఆహార కల్తీ నియంత్రణ అధికారులు ఈ ఏడాది ఇప్పటి వరకు 176 శాంపిల్స్‌ సేకరించగా 23 కేసులను నమోదు చేశారు. గతంలో నమోదు చేసిన 32 కేసుల్లో ఈ నెలలో జాయింట్‌ కలెక్టర్‌ కోర్టులో విచారణ చేపట్టగా ఆయా యజమానులకు రూ.2.33 లక్షలు జరిమానా విధించారు. ఇష్టారాజ్యంగా కల్తీ నూనెలు వినియోగంపలు హోటళ్లు, పాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, టిఫిన్‌ సెంటర్లు, దాబాలు, రెస్టా రంట్లు, బజ్జీల దుకాణాలు, గోబీ సెంటర్లు ఇలా అనేక చోట్ల కల్తీ నూనెలు ఎక్కు వగా వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మల్టీస్టోర్స్‌ విజిటబుల్‌ అయిల్స్‌ (ఎంఎస్‌వీఓ) ఆగ్‌ మార్క్‌ నిబంధనల ప్రకారం నిర్దేశించిన పరిమాణంలో మాత్రమే నూనెలు కలపాల్సి ఉంది. అయితే ఇవేమీ పట్టించుకోని వ్యాపారులు ఇష్టారాజ్యంగా కల్తీ నూనెలు విని యోగిస్తున్నారు. రెండు మూడు సార్లు కంటే ఎక్కువగా వాడిన నూనెనే మళ్లీమళ్లీ ఆహార పదార్థాల తయారీకి ఉపయోగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఆరోగ్యాలను పూర్తిగా హరించే టెస్టింగ్‌ సాల్ట్‌ ఎక్కువగా వాడుతున్నారు. కాల్షియం కార్బైడ్‌ వంటి ప్రమాదకరమైన రసాయనాలను అధికంగా వినియోగిస్తున్నారు. ప్రధానంగా బేకరీల్లో వాడుతున్న రసాయనాల వలన చిన్నపిల్లల్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. మరోవైపు పలు ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లలో ఆకర్షణీయమైన రంగులను వినియోగిస్తున్నారు. చికెన్‌, మాంసాలను రోజుల తరబడి నిల్వ ఉంచేందుకు వాటికి కలర్‌ కోటింగ్‌ ఇచ్చి వివిధ రసాయనాలను ఉపయోగిస్తున్నారు. కొన్ని రకాల రసాయ నాలను ప్రభుత్వం నిషేధించిన పదేపదే అవే వాడుతున్నారు. దాబాల్లో సైతం ఆహార పదార్థాలు రుచికోసం వినియోగిస్తున్న రసాయ నాలు వలన ప్రజలు అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలో దాదాపు పదివేల పైనే వివిధ ఆహార పదార్థాలను విక్రయించే దుకాణాలు ఉండగా 2188 మాత్రమే లైసెన్సులు తీసుకుని నిర్వహి స్తున్నారు. రూ.కోట్లలో వ్యాపారాలు సాగిస్తున్న పలువురు వ్యాపారులు లైసెన్సులు తీసుకోకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.సిబ్బంది కొరత ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి కల్తీ ఆహార పదార్థాలను నియంత్రించాల్సిన అధికారులు అరకొర చర్యలకే పరిమితమవుతున్నారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించకపోవడం కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లాకు ఆహార కల్తీ నియంత్రణ అధికారి ఒక్కరే ఉన్నారు. ఒక్కో జిల్లాకు ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు ఉండాల్సి ఉండగా ఒక్కొక్కరే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఆహార పదార్థాలను విక్రయించే వారు యథేచ్ఛగా నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నా అంతగా చర్యలు ఉండడం లేదు.

 

➡️