బంగారం వ్యాపారిపై చర్యలు తీసుకోండి

Mar 19,2024 21:09

ప్రజాశక్తి- బొబ్బిలి : నాసిరకం బంగారం ఇచ్చిన వ్యాపారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శ్రీలక్ష్మి జ్యుయాలర్స్‌లో బంగారం కొనుగోలు చేసి మోసపోయిన వృద్ధురాలు సత్తి జయమణి కోరారు. శ్రీలక్ష్మి జ్యుయాలర్స్‌ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన వృద్ధురాలు జయమణి పోలీసు స్టేషన్‌ ముందు రోడ్డుపై ఏడుస్తూ సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకరరావు, లోక్‌ సత్తా జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర్‌ల కంట పడింది. వెంటనే ఆమెను పలకరించగా తాను మోసపోయిన విషయాన్ని చెప్పి కన్నీటి పర్యంతమైంది. తాను ఐదు నెలల క్రితం శ్రీలక్ష్మి జ్యుయాలర్స్‌ షాపులో రూ.40వేలు పెట్టి కెడిఎం బంగారు చెవిదిద్దులు, ముక్కు కమ్ములు కొనుగోలు చేశానని, అవి లూజ్‌ అవ్వడంతో మార్చడానికి ఇస్తే ఐదు నెలలు తిప్పి నాసిరకం బంగారం ఇచ్చినట్లు ఆమె వాపోయింది. నాసిరకం బంగారాన్ని ఇచ్చిన వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేసింది.బంగారం అమ్మకాల్లో మోసాలను నివారించండిబొబ్బిలిలో బంగారం అమ్మకాల్లో మోసాలను నివారించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకరరావు, లోక్‌ సత్తా జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర్‌ డిమాండ్‌ చేశారు. మోసపోయిన వృద్దురాలితో కలిసి వారు విలేకరులతో మాట్లాడుతూ బొబ్బిలి పట్టణంలో ఉన్న బంగారం షాపులలో అనేక మోసాలు జరుగుతున్నాయన్నారు. బంగారం షాపు యజమానులు ప్రజలను మోసం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కెడిఎం బంగారం అని చెప్పి నాసిరకం బంగారాన్ని అమ్మి మోసం చేస్తున్నారని ఆరోపించారు. బొబ్బిలిలో కొనుగోలు చేసిన బంగారాన్ని తిరిగి అమ్మితే సగం డబ్బులు కూడా రావడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాసిరకం బంగారాన్ని అమ్మి మోసాలు చేస్తున్న వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని జయమణికు న్యాయం చేయాలని లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

➡️