బతికున్నవారి ఓట్లు తొలగిస్తున్నారు

ఫిర్యాదు అందిస్తున్న కన్నా లకీëనారాయణ
ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ :
సత్తెనపల్లి నియోజకవర్గంలో టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని, బతికున్న వారు చనిపోయినట్లు చూపించి ఓట్లు తొలగించేందుకు దరఖాస్తులు పెడుతు న్నారని పల్నాడు జిల్లా ఎన్నికల పరిశీలకులు బి.శ్రీధర్‌కు టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కన్నా లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి పంచాయతీ పరిధిలోని వెన్నాదేవిలో పోలింగ్‌ కేంద్రాలను పరిశీలనకు శ్రీధర్‌ మంగళవారం వచ్చారు. ఓటర్ల జాబితా సవరణపై బిఎల్‌ఓలతో సమావేశమయ్యారు. లక్ష్మీనారా యణ మాట్లాడుతూ వాలంటీర్ల ద్వారా ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని, అబ్బూరులో ఓకే వ్యక్తి బల్క్‌గా ఓట్లు తొలగించాలని ఫారం-7 దరఖాస్తులు చేశారని ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితాలో డోర్‌ నంబర్లు వారిగా ఓట్లు లేవన్నారు. ధూళిపాళ్లకు చెందిన కుందేటి జగన్నాథం బతికుండగానే చనిపోయాడని ఓటు తొలగింపు కోసం దరఖాస్తు చేశారని చెప్పారు. నోటీసుపై తేదీ లేకుండా నోటీసులు ఇస్తున్నారని అన్నారు. పనుల కోసం తాత్కాలికంగా వలస వెళ్లిన కూలీలు ఓట్లు తొలగిస్తున్నారని, వీటిపై సమగ్రంగా విచారణ చేయాలని కోరారు. 15 రోజుల్లో విచారణ జరిపి తప్పుడు దరఖాస్తులు పెట్టిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని శ్రీధర్‌ హామీ ఇచ్చారు. ఫారం-7 దరఖాస్తులు సమగ్రంగా విచారణ చేపట్టాలని ఆర్డీఓ బిఎల్‌ఎన్‌ రాజకుమారి, తహశీల్దార్‌ సురేష్‌ను ఆదేశించారు.

➡️