బలిజిపేటలో దాహం కేకలు

Mar 18,2024 21:48

ప్రజాశక్తి – బలిజిపేట: ‘ఆర్భాటంగా చెప్పేదేమో కొండంత… చేసేది గోరంత… అన్న చందంగా ఉంది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జలజీవన్‌ మిషన్‌ పథకం తీరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో గ్రామాల్లో ఇంటింటా కుళాయిల ద్వారా ప్రతి ఇంటికీ మంచినీరందించాలని, ఈ పథకం అమల్లోకి తెచ్చారు. అయితే ఈ పథకం అమల్లో మన రాష్ట్రం మొదటి ర్యాంకులో ఉందని గొప్పలు చెప్పుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో దీని వైఫల్యాలు అన్నీ ఇన్ని కాదు. ఇందుకు నిదర్శన బలిజిపేట. బలిజిపేటలో జలజీవన్‌ మిషన్‌ పథకాన్ని అధికారులు ఏమాత్రం ఆలోచన చేయకుండా ఏర్పాటు చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి ఎంత నీరు అవసరం, ఎన్ని ట్యాంకులు ఏర్పాటు చేయాలి, ఎన్ని కనెక్షన్లు ఇవ్వాలన్న ఆలోచనలు లేకుండా ఇష్టాను సారంగా సిసి రోడ్లకు ఇరువైపులా తవ్వి అధికారులు కొళాయిలు ఏర్పాటు చేశారు. అయితే ఇంతవరకూ చుక్కనీరు కూడా ఈ పథకం ద్వారా గ్రామస్తులకు చుక్క నీరు అందని పరిస్థితి. బలిజిపేటలోని పలగరలో గుడివాడ కాలనీ, బలిజిపేట దళితపేటకు రెండు నెలలు నుండి గుక్కెడు మంచినీళ్లు కోసం ప్రజలు అల్లాడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకున్న పాపాన లేదు. ఈ సందర్భంగా ఆయా వీధుల మహిళలలు మాట్లాడుతూ రెండు నెలలు నుంచి తాగడానికి నీరు లేక అల్లాడిపోతున్నామని, కనీసం అధికారులు గానీ, పంచాయతీ కార్యదర్శి గానీ పట్టించుకోలేడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడే నీరు లేకపోతే రానున్న వేసవిలో మరింత ఇబ్బందులు తప్పవని ఈ సందర్భంగా వారి తమ గోడును సిపిఎం నాయకులు యమ్మల మన్మధరావు వద్ద వెల్లబుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మన్మధరావు మాట్లాడుతూ ప్రభుత్వం, అధికారులు ఎంతో ఆర్భాటంగా ఇంటింటి కొళాయిలు వేశారని, నిరంతరం తాగడానికి నీళ్లు వస్తాయని ప్రజల ఆశపడ్డారు కానీ, వేసిన కుళాయిలు ఉత్సవిగ్రహంలో ఉన్నాయి తప్ప ఉపయోగం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బలిజిపేట మండల కేంద్రంలో ఎప్పుడూ తాగునీటి సమస్య ఉందని, ఈ సమస్య ప్రతి ఏటా వెంటాడుతుందని అన్నారు. ఈ సమస్యను అధికారులు, నాయకులు పట్టించుకోవడంలేదని, శాశ్వత పరిష్కారం చూపాల్సిన అధికారులు, నాయకులు ఇలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని అన్నారు. మంచినీటి సమస్య వల్ల మండలంలో అనేక గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తాగడానికి నీళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

➡️