బాధిత రైతులను తక్షణం ఆదుకోవాలి

Dec 8,2023 22:46 #రైతులను
బాధిత రైతుల

ప్రజాశక్తి – యంత్రాంగం తుపాను వల్ల నష్టపోయిన రైతులను తక్షణం ఆదుకోవాలని పలు పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు. దెబ్బతిన్న పంటలను శుక్రవారం వారు పరిశీలించారు. తాళ్లరేవు తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని తేమశాతం పెంచి రైతుకి నష్టం లేకుండా మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎపి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాబాబు డిమాండ్‌ చేశారు. ఇప్పటివరకు కోయలేని పంట పొలాలకు పంట నష్టం అంచనా వేయాలని, ఎకరానికి రూ.30 వేల పరిహారం ఇవ్వాలన్నారు. ఇంజరం, ఉప్పంగల, సుంకరపాలెం గ్రామాల్లో ఆయన పంట చేలను పరిశీలించారు. ఈ మూడు పంచాయతీల పరిధిలో మురుగు కాలువలు బాగు చేయక మురుగునీరు దిగడం లేదన్నారు. పడిపోయిన వరి పొలాలు మొలక వస్తున్న కారణంగా వెంటనే పంట నష్టం అంచనా వేయాలన్నారు. సంచితో 76 కేజీలు తూయాల్సి ఉండగా 76 కేజీల 500 గ్రాములు తూకం వేస్తున్నారని అయినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. దీనివల్ల రైతులకు నష్టం జరుగుతోందన్నారు. తాళ్లరేవులో ఒక కౌలు రైతు 150 బస్తాలు మిల్లుకు పంపిస్తే 27 పాయింట్లు వస్తే 9 కేజీలు తగ్గించవలసి ఉండగా 13 కేజీలు తగ్గిస్తామని మిల్లర్లు అంటున్నారని చెప్పారు. ఆయన వెంట చీకట్ల సత్యనారాయణ, గురజాపు వెంకటరమణ, గణేష్‌ ఉన్నారు. ప్రతి ఎకరాకరూ రూ.25 వేలు నష్టపరిహారం ఇవ్వాలని జనసేన పార్టీ పిఎసి సభ్యుడు పితాని బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం చొల్లంగి, చొల్లంగిపేట, జి.వేమవరంలో ఆయన పంట పొలాలను పరిశీలించారు. రైతులకు పంటల బీమా వర్తించేలా చేయాలని, 75 కేజీల బస్తా ధాన్యం రూ.1637,లు సాధారణ రకం, ఎ గ్రేడ్‌ రూ.1652కు కొనుగోలు చెయ్యాలని కోరారు. మురుగు కాలువలకు పూడికలు వెంటనే తీయించాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట అత్తిలి బాబూరావు, జి.వేమవరం సర్పంచ్‌ పుణ్యమంతుల సూరిబాబు, వెలుగుబంట్ల సూరిబాబు, దూడల స్వామి, పెన్నాడ శివ, అంకన ఆంజనేయులు, కనకాల పెదబాబు, సుందరపల్లి సత్యనారాయణ, నరాల రామకృష్ణ, కందుల సత్తిబాబు, వైటిఆర్‌ తదితరులు పాల్గొన్నారు. రౌతులపూడి మండలంలోని ఎం.చామవారం గ్రామ శివారులో ఉన్న గుర్రపు చెరువు గండి కొట్టడంతో దెబ్బ తిన్న పంటలను ఎంఎల్‌ఎ పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ పరిశీలించారు. పంట నష్టంపై రైతులను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సత్యవేణి మురళి, స్థానికులు ఉన్నారు. సామర్లకోట రూరల్‌ పంట మొలకలు వచ్చి ధాన్యం ఎందుకు పనికిరాకుండా మారిపోయిందని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని భీమవరం గ్రామానికి చెందిన రైతులు కోరారు. వాతావరణం తెరపి ఇవ్వడంతో రైతులు బరకాల క్రింద భద్రపరిచిన ధాన్యం రాశులను విప్పి చూసుకుని మొలకలు రావడంతో ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన రైతు త్సలికి పెదకాపు తన అయిదెకరాల పంట పూర్తిగా పాడైందన్నారు. సమీప రైతులు సుమారు 500కు పైగా ఎకరాల ధాన్యం వర్షం దాటికి రాశుల అడుగున మొలకలెత్తాయి. తమను ప్రభుత్వ ఆదుకోవాలని కోరారు.

➡️