బిజెపిలో ఓటమి భయం

Mar 28,2024 23:02

ప్రజాశక్తి-తాడేపల్లి : వామపక్ష ఉద్యమాల పోరాటాల గడ్డ మంగళగిరి నియోజకవర్గంలో ఇండియా వేదిక అభ్యర్థులకు వేసే ప్రతి ఓటు ఒక బుల్లెట్‌ లాంటిదని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య అన్నారు. గురువారం రాత్రి తాడేపల్లి మేకా అమరారెడ్డి భవన్‌లో సిపిఎం పట్టణ విస్తృత సమావేశం కె.కరుణాకరరావు అధ్యక్షతన నిర్వహించారు. కృష్ణయ్య మాట్లాడుతూ ప్రజల కోసం జెండాలెత్తి ప్రజల కోసం ప్రాణాలిచ్చి అనేక మంది ప్రాణ త్యాగాలు చేసిన గడ్డ మంగళగిరి ప్రాంతం అని చెప్పారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని సిఎం స్థాయి వ్యక్తులను కూడా రాత్రికిరాత్రి అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. బిజెపికి ఓటమి భయం పట్టుకునే ఈ విధమైన దుర్మార్గాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెడతామని ఎన్‌టిఆర్‌ స్థాపించిన టిడిపి నేడు ఢిల్లీ పాలకుల ముందు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిందన్నారు. దేశంలో రైతు, కార్మిక పోరాటాలు క్యాంపెయిన్‌గా నడిపిస్తున్న సిపిఎంను చూసి మోడీ వెన్నులో వణుకు పుట్టిందని చెప్పారు. బిజెపి ఎదిరించ గల శక్తి ఎర్రజెండాకు మాత్రమే ఉందన్నారు. ప్రత్యేక హోదా అమలు చేయకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన మోడీకి టిడిపి, జనసేన, వైసిపిలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రజల పక్షాన నిలిచే అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ నెల 30వ తేదీ సుందరయ్య నగర్‌లో జరిగే మాలకొండారెడ్డి వర్ధంతి సభను జయప్రదం చేయాలన్నారు. అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు మాట్లాడారు. రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సూర్యారావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నేతాజీ, నాయకులు డి.శ్రీనివాసకుమారి, వి.దుర్గారావు పాల్గొన్నారు.

➡️