బిజెపి కలయికతో టిడిపికి చీకటి రోజులు

Mar 12,2024 21:21

 ప్రజాశక్తి-డెంకాడ : బిజెపితో జత కట్టడంతో జిల్లాలో టిడిపికి చీకటి రోజులు వచ్చినట్టేనని టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం ఎంపి టిక్కెట్‌ను బిజెపికి కేటాయించిన నేపథ్యంలో తామంతా రాజీనామా చేస్తామని ప్రకటించారు. వెంటనే అధిష్టానం పునరాలోచించి టిడిపికి కేటాయించాలని డిమాండ్‌ చేశారు. స్థానిక టిడిపి కార్యాలయంలో మంగళవారం మండల శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్‌ నాయకులు కంది చంద్రశేఖర రావు, జెడ్‌పిటిసి మాజీ సభ్యులు పతివాడ అప్పలనారాయణ విజయనగరం పార్లమెంట్‌ ఆర్గనైజర్‌ సెక్రటరీ పానిరాజు, పార్టీ అధ్యక్షుడు పల్లె భాస్కరరావు మాట్లాడారు. నెల్లిమర్ల నియోజకవర్గం టిడిపికి కంచుకోట లాంటిదని, అలాంటిది జిల్లాలో టిడిపి ఉనికి లేకుండా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పనిసరిగా గెలుస్తామనుకున్న సీటును జనసేనకు కేటాయించడంతో పార్టీ ఆదేశాలు ప్రకారం నడుచుకుందా మని అనుకున్నామని, ఇంతలో బిజెపికి పార్లమెంట్‌ సీటు కేటాయించడం సరైనది కాదని అన్నారు. గతంలో పార్లమెంట్‌ పరిధిలో బిజెపికి 7వేల ఓట్లు మాత్రమే వచ్చాయని, ఇక్కడ కార్యకర్తలు, నాయకులు లేక పక్క జిల్లాల నుంచి దిగుమతి చేసి పోటీ చేయించడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఎంపి టిడిపికి కేటాయిస్తే అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు. 2019 ఎన్నికల తరువాత టిడిపి జెండాను మోసి, పార్టీని నిలబెట్టామని, నాయకులు, కార్యకర్తలు అభిప్రాయాలు తీసుకోకుండా ఎమ్మెల్యే ఎంపీ టికెట్లను జనసేనకు, బిజెపికి కేటాయించారని అన్నారు. నియోజకవర్గంలో పార్టీ లేకుండా చేశారని ఆవేదన చెందారు. పార్టీ బతకాలంటే నియోజకవర్గానికి చెందిన వ్యక్తిగాని, జిల్లాలో ఉన్న వ్యక్తికి గాని టిడిపి ఎంపీ టికెట్‌ ఇస్తే పార్టీ బతుకుతుందని తెలిపారు లేదంటే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తామని తెలిపారు. సమావేశంలో ఎఎంసి మాజీ వైస్‌ చైర్మన్‌ కాగితాల సత్యనారాయణ, నాయకులు చీకటి సుహాసిని, బంటుపల్లి మురళీధర్‌ రావు, పడాల చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.

➡️