భూహక్కు చట్టాన్ని ఉపసంహరించుకోవాలి

Dec 27,2023 21:34

ప్రజాశక్తి- శృంగవరపుకోట : రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త భూహక్కు చట్టాన్ని (ఎపి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌-2023) తక్షణం ఉపసంహరించు కోవాలని ఎస్‌.కోట బార్‌ అసోసియేషన్‌ న్యాయ వాదులు డిమాండ్‌ చేశారు. పట్టణంలోని మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు న్యాయవాదులు బుధవారం విధులు బహిష్కరించి కోర్టు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్య దర్శులు అల్లు సత్యాజీ, డబ్ల్యూఎన్‌ శర్మ మాట్లాడుతూ ఈ చట్టంతో స్థానిక కోర్టులకు విచారణ పరిధి లేకుండా చేశారన్నారు. కేవలం టైటలింగ్‌ అధికారులకే అధికారం ఇవ్వడం వల్ల వీరిపై రాజకీయ జోక్యం పెరిగే అవకాశం ఉందని, పేద రైతులు మరింతగా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పారు. ఇందుకు సంబంధించిన వాజ్యాలను హైకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం లేక పేద రైతులు ఇక్కట్లు పడతారన్నారు. రైతాంగ సమస్యలు, భూ సమస్యలు సత్వరం పరిష్కరించే యోచన ఉంటే కోర్టులు పెంచి, ఉద్యోగుల సంఖ్య పెంచి భూ కేసులను పరిష్కరించాలని సూచించారు. నూతన భూహక్కు చట్టం ఉపసంహరించాలని కోరుతూ ఈనెల 29వ తేదీ వరకు కోర్టు విధులు బహిష్కరణ కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. ఈ నిరసన కార్యక్రమంలో న్యాయవాదులు బి.త్రిమూర్తులు, జి.ప్రకాష్‌, వారాది ఈశ్వరరావు, టీవీఆర్‌ మూర్తి, జి.చిట్టిబాబు, బి.సత్యనారాయణ, ఆర్‌.సత్యనారాయణ, బొడ్డు వెంకటరావు, బి.శివశేఖర్‌ బాబు, వసంత శ్రీనివాసరావు, బీవీఎస్‌ రామారావు, సంతోష్‌, కర్రి వెంకటరమణ, బొబ్బిలి రామకృష్ణ, అనూరాధ తదితరులు పాల్గొన్నారు..

➡️