మతతత్వ బిజెపిని ఓడించండి

ప్రజాశక్తి-సంతనూతలపాడు: రానున్న ఎన్నికల్లో మతతత్వ బిజెపిని ఓడించాలని ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ అధ్యక్షుడు దాసరి సుందరం ప్రజలకు పిలుపునిచ్చారు. మండలంలోని పేర్నమిట్ట పరిధి పీర్లమాన్యంలో గల డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద సోమవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా దాసరి సుందరం మాట్లాడుతూ రాజ్యాధికారం ద్వారానే దళిత బహుజనులకు సాంఘిక సమానత్వం వస్తుందని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలను నిర్వహిస్తూ మనుధర్మ శాస్త్రాన్ని దేశంలో ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తుందని ఆయన విమర్శించారు. మతతత్వ బిజెపితో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు స్నేహం కోసం ఎదురుచూడటం ప్రజలను వంచించడమేనన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో 11 బహుజన పార్టీలు కలిపి జేఏసీగా ఏర్పడి అన్ని అసెంబ్లీ పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటును జేఏసీకి వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా జిల్లా అధ్యక్షుడు ఎస్కే సుల్తాన్‌, ఐఎల్‌పి జిల్లా అధ్యక్షుడు కే వరప్రసాద్‌, నాయకులు డి సంగీతరావు, ఎస్‌కే కాసిం భారు, ఎస్కే సైదా, కే నారాయణ, కోటేశ్వరరావు, సుబ్బారావు, శ్యాం ప్రసాద్‌, నరసింహారావు పాల్గొన్నారు.

➡️