మతోన్మాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలి

ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : దేశంలో పెరుగుతున్న మతోన్మాదాన్ని కూకటి వేళ్లతో పెకలించాలంటే బిజెపిని ఓడించడం ద్వారానే సాధ్యమని, ఇందుకు కృషి చేస్తున్న సిపిఎం ఉద్యమాల్లో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణం కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో సిపిఎం పల్నాడు జిల్లా కమిటీ సమావేశం సోమవారం జరిగింది. సమావేశానికి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ.లక్ష్మీశ్వరరెడ్డి అధ్యక్షత వహించగా కృష్ణయ్య మాట్లాడారు. ఇటీవల 4 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బిజెపి గెలుపొందడం చూస్తే మతోన్మాద ప్రమాదం ఏ స్థాయిలో ఉందో తేటతెల్లమైందన్నారు. మతోన్మాద బిజెపి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు బిజెపి వల్ల కార్మికులకు, కర్షకులకు, ఉద్యోగులకు మొత్తంగా దేశానికి కలిగే నష్టాలను వివరిస్తూ బిజెపి విధానాలను ఎండగట్టే కృషిలో సిపిఎం ఉందని, నిత్యం ప్రజల సమస్యలపై పోరాడుతోందని చెప్పారు. బిజెపి ప్రమాదాన్ని గుర్తించి బిజెపి వ్యతిరేకులను, ఆ పార్టీ విధానాలకు బలవుతున్న కార్మికులు, ఉద్యోగులు, ఇతర రంగాల ప్రజలను ఐక్యం చేయాల్సి ఉందని, బిజెపి, దాని మిత్ర పక్షాలు అధికారంలోకి రాకుండా ఐక్యంగా కృషి చేయడానికి ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపాల్సి ఉందని అన్నారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలోని సాగు భూమిలో సగం బీడుగా ఉందని, ఆరుతడి పంటలు సాగుచేయాలనే ప్రభుత్వం ప్రకటనతో సాగు చేసిన పంటలు సైతం నీరులేక ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. అయినా ఒక్క మండలాన్నీ ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న, సన్నకారు రైతులు వడ్డీలకు అప్పుడు తెచ్చిమరీ పెట్టుబడులు పెట్టారని, కరువు మండలంగా ప్రకటించి ఉంటే నష్టపరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీ వంటి రాయితీలు రైతులకు దక్కేవని చెప్పారు. ఒక్క ఎకరాను కూడా ఖాళీగా ఉంచొద్దని ఇటీవల ఒక సమీక్షలో జిల్లా కలెక్టర్‌ చెప్పారని, నీరు లేకుండా ఏ పంటలు సాగు చేయాలో పరిశీలన, ఆచరణ లేకుండా సమీక్షలతో సరిపెడితే ఎలాగని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు విత్తనాలు సరిగా అందుబాటులో లేవని, ఉన్న కొద్దిపాటి విత్తనాలు కూడా రాజకీయ పార్టీలు వారి అనుచర గణానికి చెందిన రైతులకే ఇప్పిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్‌ రాకమునుపే వరికపూడిశెల ప్రాజెక్టు పనులను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలను వేధించడం మానుకొని వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఆశాలను యాప్‌ల పేరుతో వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈనెల 11, 12 తేదీల్లో 36 గంటలు ధర్నా చేస్తున్నారని, వారి పోరాటాలకు సిపిఎం మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ప్రకటించారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.రాధాకృష్ణ, ఏపూరి గోపాలరావు, జి.రవిబాబు, నాయకులు డి.శివకుమారి, జి.మల్లీశ్వరి, డి.విమల, పి.మహేష్‌, టి.పెద్దిరాజు, జి.బాలకృష్ణ పాల్గొన్నారు.

➡️