మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేయాలి

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను దళారీల బారి నుంచి రక్షించాలని సిపిఎం, టిడిపి నాయకులు అధికారులను డిమాండ్‌ చేశారు. జియ్యమ్మవలస మండలం డంగభద్రలో సిపిఎం, టిడిపి నాయకులు ధాన్యం కొనుగోలును పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొల్లి గంగనాయుడు మాట్లాడుతూ ధాన్యానికి మద్దతు ధర లేకపోవడంతో రైతులు దళారులకు అమ్ముకుంటున్నారన్నారు. ప్రభుత్వం ఒకవైపు 80 కేజీలు బస్తా ధాన్యం రూ.1746కు కొంటామని చెబుతున్నప్పటికీ వాస్తవంగా రైతులకు మద్దతు ధర రావడంలేదన్నారు. ప్రభుత్వం ఇస్తామన్న గోనె సంచులు, రవాణా ఛార్జీలు, కళాసీ కూలీ రైతులకు చేరడం లేదని,దళారీలే లాగేస్తున్నారని అన్నారు. ఆఖరుకు రైతులు దళారులకు 84 కేజీల ధాన్యాన్ని రూ.1500 నుంచి రూ.1600కు అమ్ముకుంటున్నారని అన్నారు. ఈ లెక్కన బస్తా ధాన్యం వద్ద రూ.250 వరకు రైతులు నష్టపోతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎటువంటి షరతు ల్లేకుండా రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని, రవాణా ఏర్పాట్లు అధికారులే బాధ్యత పడి రైతులకు ఇవ్వాలని, గోనె సంచులు ఇవ్వాలని, కళాసీ కూలీ కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతులు కూడా దళారులకు ధాన్యం అమ్మకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మద్దతు ధరకు ధాన్యం అమ్ముకోవాలని అన్నారు. రానున్న రోజుల్లో రైతులంతా కదిలి పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కోరంగి సీతారాం, డంగభద్ర సర్పంచ్‌ జోగి భుజంగ నాయుడు, రైతులు పాల్గొన్నారు.

➡️