నాణ్యమైన వైద్యం అందించాలి

ప్రజాశక్తి – తణుకు

ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించేలా వైద్యులు కృషి చేయాలని తణుకు ఎంఎల్‌ఎ ఆరిమిల్లి రాధాకృష్ణ సూచించారు. శుక్రవారం స్థానిక జిల్లా ఆసుపత్రిని ఆరిమిల్లి రాధాకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆసుపత్రిలోని అవుట్‌ పేషెంట్‌ విభాగం, అత్యవసర విభాగం, వెటర్నిటీ వార్డు, ఆపరేషన్‌ థియేటర్‌, పోస్టునేటల్‌ వార్డు, నవజాత శిశువు సంరక్షణ (ఎస్‌ఎన్‌సియు), డయాలసిస్‌ విభాగాలను పరిశీలించి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వెలగల అరుణ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగులను ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ప్రాముఖ్యతిస్తోందన్నారు. గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా 2019లో చంద్రబాబునాయుడు ఈ ఆసుపత్రిని ఏరియా ఆసుపత్రి నుంచి జిల్లా ఆసుపత్రి స్థాయికి అభివృద్ధి చేశారని తెలిపారు. వైసిపి హయాంలో నిర్లక్ష్యం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ఈ ఆసుపత్రిని జిల్లాస్థాయికి అనుగుణంగా అన్ని విధాలా అభివృద్ధి చేసి తణుకు, తణుకు పరిసర ప్రాంతాల ప్రజలకే కాకుండా జిల్లా ప్రజలందరికీ అన్ని సౌకర్యాలూ అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరికైనా గుండెపోటు వస్తే మొదటిగా లైఫ్‌సేవింగ్‌(గోల్డెన్‌ అవర్‌) గంటలో ప్రాణాలను కాపాడే అన్ని సౌకర్యాలూ ఉన్నాయన్నారు. వారు ఆసుపత్రికి వస్తే ఇసిజి చేసి, దానికి సంబంధించిన ఇంజెక్షన్‌ చేస్తే వారి ప్రాణాలు కాపాడబడతాయన్నారు. కేన్సర్‌ బారిన పడినటువంటి వారు కీమోథెరఫీ చేయించుకునే సౌకర్యం ఇక్కడ ఉందన్నారు. మొదటి రెండు కీమోథెరఫీలు ఎక్కడైతే వారు వైద్యం చేయించుకుంటున్నారో అక్కడ చేయించుకున్న తరువాత ఫాలోఅప్‌ కీమోథెరఫీలన్నీ ఉచితంగా ఈ ఆసుపత్రిలో చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు గమనించి సౌకర్యాలను వినియోగించుకోవాలన్నారు. సేవలన్నీ సక్రమంగా అందేలా చూసి రాష్ట్రంలోనే బెస్ట్‌ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, వైద్యులు సాయిబాలాజీ పాల్గొన్నారు.

➡️