సిబిఎం పాఠశాల ఆస్తులను కాపాడాలి

Jun 28,2024 20:49

 ప్రజాశక్తి-బొబ్బిలి : సిబిఎం పాఠశాల ఆస్తులను కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.శంకరరావు డిమాండ్‌ చేశారు. పట్టణానికి చెందిన ఒక వైద్యునికి అక్రమంగా విక్రయించిన సిబిఎం పాఠశాల సిబ్బంది క్వార్టర్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబిఎం పాఠశాల ఎయిడెడ్‌ యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తోందన్నారు. కొన్నేళ్ల క్రితం పాఠశాల సిబ్బంది క్వార్టర్స్‌, బాలికల వసతి గృహం స్థలాన్ని అక్రమ మార్గంలో అమ్మివేసినట్లు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కరస్పాండెంట్‌ విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో చెప్పారన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎయిడెడ్‌ పాఠశాల స్థలాలను ఎలా విక్రయిస్తారని ప్రశ్నించారు. సిబిఎం ఆస్తులను అమ్మివారిపైన, కొన్నవారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అమ్మివేసిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని, అవి అన్యాకాంతం కాకుండా కాపాడాలని కోరారు. పట్టణంలో ఉన్న సిబిఎం పాఠశాల ఆవరణలో జూనియర్‌, డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌.గోపాలం, బాడంగి మండల కార్యదర్శి సురేష్‌, యుగంధర్‌ పాల్గొన్నారు.

➡️