ట్రిపుల్‌ఐటిలో ప్రవేశానికి 53, 863 దరఖాస్తులు

ప్రజాశక్తి – వేంపల్లె ఆర్‌జెయుకెటి యూనివర్సిటీ పరిధిలోని 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నూజివీడు, ఇడుపులపాయి, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌ల్లో ఆరేళ్ల సమీకత్త బిటెక్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశాలకు కోసం 53, 863 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నట్లు ఆర్‌జెయుకెటి ఆడ్మిషన్‌ కన్వీనర్‌ అమరేంద్రకుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25న సాయంత్రం 5 గంటలకు దరఖాస్తులు చేసుకొనేందుకు ఆఖరు గడువు ముగిసిందన్నారు. దరఖాస్తు చేసుకున్న వాటిలో ప్రభుత్వ పాఠశాలల నుంచి 34,354 మంది, ప్రయివేటు పాఠశాలల నుండి 19,671 మంది, ఇతర రాష్ట్రాల నుండి 38 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వారిలో బాలికలు 30,857 మంది, బాలురులు 23,006 మంది న్నారని పేర్కొన్నారు. ప్రత్యేక కేటగిరీలో సైనిక సంతతి విభాగంలో 2,582 మంది, ఎన్‌సిసి విభాగంలో 1830 మంది, క్రీడాల విభాగంలో 1162 మంది, విభిన్న ప్రతిభావంతుల విభాగంలో 332 మంది, భారత స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విభాగంలో 270 మంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు. ఎన్‌సిసి, క్రీడలు, విభిన్న ప్రతిభావంతుల కేటగిరిలో దరఖాస్తులు చేసుకున్న వారికి నూజివీడు క్యాంపస్‌లో దరఖాస్తుల పరిశీలన ఉంటుందని తెలిపారు. సైనిక సంతతి (క్యాప్‌) జులై 1 నుంచి 3వ వరకు సర్టిఫికెట్లు పరిశీలన ఉండగా ఎన్‌సిసి, క్రీడా విద్యార్థులకు 3 నుంచి 5 వరకు, విభిన్న ప్రతిభావంతులకు 3వ తేదీన, భారత స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థులకు 2 నుండి 3వ తేది వరకు సర్టిఫికెట్లు పరిశీలన ఉంటుందన్నారు. క్యాంపస్‌ల వారిగా ఎంపికైన విద్యార్థుల తుది జాబితా జులై 11న విడుదల చేస్తారని తెలిపారు. ఎంపికైన విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన నూజివీడు, ఇడుపులపాయి(ఆర్కే వ్యాలీ) ప్రాంగణంలో జులై 22, 23 తేదీల్లో ఒంగోలు, ఇడుపులపాయ ప్రాంగణంలో జూలై 24, 25 తేదీల్లో, శ్రీకాకుళం ప్రాంగణంలో 26,27 తేదీల్లో ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునేటప్పుడు ఏదైనా కారణం చేత ప్రత్యేక కేటగిరి సర్టిఫికేట్‌ పెట్టడం మర్చిపోయిన వారి సంబంధిత సర్టిఫికెట్‌ తీసుకొని కేటాయించిన ఆయా తేదీలలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కోసం ఆర్‌జెయుకెటి నూజివీడు క్యాంపస్‌కు రావాలని కోరారు. అభ్యర్థి మెరిట్‌, కేటగిరి ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తులో ఇచ్చిన ప్రాధాన్యత ఆధారంగా క్యాంపస్‌ కేటాయిస్తారని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను అడ్మిషన్‌ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత క్యాంపస్‌ల మధ్య అభ్యర్థుల అంతర్గత బదిలీ ఉండదని తెలిపారు.

➡️